ఆలియా భట్- రణబీర్ కపూర్ జంట డ్రీమ్ హౌస్ ముంబై లో నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. తరతరాల వారసత్వపు ఆస్తిగా వచ్చిన ఈ ఆస్తి విలువ (కొత్త ఇంటి నిర్మాణం కలుపుకుని) దాదాపు 250కోట్లు. రాజ్ కపూర్ నుంచి మనవడు రణబీర్ కి ఈ ఆస్తి దక్కింది. ఇప్పుడు దీనిని తన కుమార్తె రాహా కపూర్ కి రణబీర్ బదలాయిస్తున్నాడు. మూడేళ్లుగా ఈ ఇంటి నిర్మాణం కోసం ఆలియా-రణబీర్ చాలా శ్రమించాల్సి వచ్చింది. నిర్మాణ సమయంలో ప్రతిదీ దగ్గరుండి చూసుకుంది ఆలియా. ఇప్పుడు నిర్మాణం పూర్తయి, ఇంటీరియర్ డిజైనింగ్ దశకు చేరుకుంది. మరో నెలరోజుల్లో గృహ ప్రవేశం కూడా చేస్తారని అంతా భావిస్తున్నారు. ఆలియా-రణబీర్ అభిరుచి మేరకు ఈ ఇంటిని సకల సౌకర్యాలతో అత్యంత విలాసవంతంగా నిర్మిస్తున్నారు.
అయితే ఈ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త ఇంటి ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో లీక్ కావడంపై ఆలియా భట్ సీరియస్ గా ఉన్నారు. మీ ఇంటి లోపలి ఫోటోలు, వీడియోలను మీ అనుమతి లేకుండా ఎవరైనా షేర్ చేస్తుంటే దానిని సహిస్తారా? అంటూ సీరియస్ గా ప్రశ్నించారు ఆలియా. ముంబై లాంటి ఇరుకు ప్రదేశంలో ఒకరి ఇంటి నుంచి ఎదుటివారి ఇంటిని చిత్రీకరించడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు ఆలియా. ఇది భద్రతకు ముప్పు.. గోప్యతపై దాడి! అని తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఫోటోలు లేదా వీడియోలను ఎవరూ షేర్ చేయవద్దు. మీడియా మిత్రులు వాటన్నిటినీ సోషల్ మీడియాల నుంచి తొలగించాలని అభ్యర్థిస్తున్నాను! అని అన్నారు.
మీడియా తన గోప్యతకు భంగం కలిగించడంపై ఆలియా భట్ చాలా సార్లు ఫిర్యాదు చేసింది. ఇంతకుముందు తన ఇంట్లో ఒక రూమ్ లో ఉన్నప్పుడు ప్రైవసీకి భంగం కలిగిస్తూ ఎవరో తనను షూట్ చేసారని ఆలియా చాలా సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియా క్షమాపణలు చెప్పడంతో పరిస్థితి సద్ధుమణిగింది. దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ భవంతిని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించక ముందే వీడియోలు, ఫోటోల రూపంలో బహిర్గతం చేయడం సరికాదని ఆలియా సీరియస్ అయ్యారు.