ఆరడుగుల ఒడ్డు పొడుగు, అందంతో అందరి దృష్టిని ఆకర్షించిన నటి ఫరియా అబ్ధుల్లా. ఈ తెలుగమ్మాయి కెరీర్ ఆరంభమే బ్లాక్ బస్టర్ తో మొదలైంది. `జాతి రత్నాలు` బిగ్గెస్ట్ హిట్ చిత్రం. కానీ ఆ తరవాత సక్సెస్‌ని ఒడిసి పట్టుకుని కెరీర్ బండిని ముందుకు సాగించడంలో తడబడుతోంది ఫరియా. ఇటీవల టాలీవుడ్ కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. దీంతో కోలీవుడ్‌లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఫరియా ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. కానీ తెలుగులో తెలుగమ్మాయికి ఎందుకనో అవకాశాలు రావడం లేదు.
బహుశా తన `ఎత్తు` పెద్ద సమస్యగా మారిందేమో! అంటూ అభిమానులు ఊహిస్తున్నారు. అనుష్క తర్వాత మళ్లీ అంత ఎత్తు ఉన్న నటి ఫరియా. కానీ అనుష్కలా పాపులర్ కాలేకపోతోంది! అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇటీవల ప్రభుదేవా నిర్వహించిన ఓ ఈవెంట్ లో ఫరియా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. భారతదేశంలో కిక్ బాక్సింగ్ స్పోర్ట్స్ ని ప్రోత్సహిస్తూ ఓ ప్రకటనలో కనిపించింది. వేదిక ఏదైనా ఫరియా కేంద్రక ఆకర్షణగా మారుతోంది.
ఇప్పుడు ఈటీవీ 30 వసంతాల ఉత్సవం కోసం విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి ముందు మెగా మాషప్ సాంగ్ కి డ్యాన్సులు చేసి ఆశ్చర్యపరిచింది. చిరు ఫరియా నాట్యానికి పరవశుడైపోయారు. చిరంజీవి డ్యాన్స్ చేసిన ఎన్నో క్లాసిక్ హిట్ సాంగ్స్ నుంచి ఎంపిక చేసిన పాటలతో మాషప్ కు ఫరియా ఎంతో పర్ఫెక్ట్ గా డ్యాన్సులు చేసి ఆకట్టుకుంది. అంతేకాదు వేదికపై మైమరిచి ఫరియాతో చిరు కూడా స్టెప్పులేసారు. ఈ వేదికపై ఖుష్బూ సుందర్ కూడా చిరు, ఫరియాతో పాటు డ్యాన్సులు చేయడం ఆకట్టుకుంది. ఎంతో ఆకర్షణ ఉన్న వేదికపై ఫరియా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే పెద్ద స్టార్లు ఇలా చూసి వెళ్లిపోవడం కాదు.. ఈ తెలుగమ్మాయి ప్రతిభను గుర్తించి అవకాశాలు వచ్చేందుకు సహకరించడం చాలా ముఖ్యం. మెగాస్టార్ ఆశీస్సులతో ఇకపై అయినా ఫరియా అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి.