సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `కూలీ` టికెట్ ధరల గురించి సోషల్ మీడియాల్లో తీవ్రమైన చర్చ సాగుతోంది. ఈ సినిమా బెనిఫిట్ షోల కోసం పెద్ద మొత్తంలో టికెట్ ధరలు పెంచారని, తెల్లవారు ఝాము షోలకు హైడిమాండ్ నెలకొనడంతో టికెట్ ధర చుక్కల్ని తాకుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు అదుపులో లేవని కూడా విమర్శలొస్తున్నాయి.
చెన్నై పీవీఆర్‌లో కూలీ టికెట్ ధర 183 ఉంటే, హైదరాబాద్ పీవీఆర్‌లో రూ.453 టికెట్‌కి వసూలు చేస్తున్నారని సోషల్ మీడియాల్లో సినీప్రియుల నుంచి విమర్శలొస్తున్నాయి. ఇదే తీరుగా టికెట్ ధరలు పెంచుతూ వెళితే, బోయ్ కాట్ ట్రెండ్ ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక నెటిజన్ హెచ్చరించాడు. తమిళనాడులో కంటే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు చుక్కల్ని తాకడాన్ని అతడు ప్రశ్నించాడు. ఎంత తోపు సినిమా అయినా ఓటీటీలోకి రావాల్సిందేనని తన కోపం వెల్లగక్కాడు.
కూలీ సినిమాకి ఉత్తరాదిన వార్ 2 నుంచి తీవ్రమైన పోటీనెలకొనడంతో దక్షిణాదిన అత్యంత భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా బుకింగులు ప్రారంభం కాగానే టికెట్ విండో షేకైందని టాక్ వినిపిస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరతో పోలిస్తే చెన్నై, తమిళనాడులో చాలా తక్కువ ధరలు ఉన్నాయి. అక్కడ రూ.57 మొదలు రూ.180వరకూ టికెట్ ధరలు ఉన్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభ షోలకు రూ.500 వరకూ వసూలు చేస్తున్నారని విమర్శలొస్తున్నాయి. రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర తదితరులు నటించిన కూలీ ఈనెల 14న థియేటర్లలో విడుదలవుతోంది.