హృతిక్ రోషన్ - ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన స్పై అడ్వెంచర్ థ్రిల్లర్ `వార్ 2` ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుక ఆద్యంతం తారక్ అభిమానుల కోలాహాలం కనిపించింది. వేదికపై నుంచి ఎన్టీఆర్, హృతిక్ ఫ్యాన్స్ ని గ్రీట్ చేసారు. టాలీవుడ్ నిర్మాత నాగ వంశీ ప్రసంగం ప్రధాన హైలైట్‌లలో ఒకటి. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో వేలాది మంది అభిమానుల ఉత్సాహం నడుమ నాగవంశీ మాట్లాడుతూ.. దర్శకుడు అయాన్ ముఖర్జీ `వార్ 2` సరైన తెలుగు సినిమాలా అనిపించేలా తగిన జాగ్రత్తలు తీసుకున్నారని అన్నారు. అభిమానులు కచ్ఛితంగా ఈ యాక్షన్ సినిమాను ఇష్టపడతారు. వార్ 2 నచ్చకపోతే మీరు నన్ను ఎంత తిట్టినా తిట్టవచ్చు. వార్ 2 తెలుగు వెర్షన్ హిందీ వెర్షన్ కంటే ఎక్కువ వసూళ్లు చేసేలా చూసుకోవాలి అని తారక్ ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచారు.
ఎన్టీఆర్‌ను హిందీ సినిమాకు పంపడం కంటే హృతిక్ రోషన్‌ను తెలుగు సినిమాకు స్వాగతిస్తున్నట్లు అనిపిస్తోందని కూడా `వార్ 2` తెలుగు వెర్షన్ సమర్పకుడు నాగవంశీ అన్నారు. ఎన్టీఆర్ అన్న మనకోసం చాలాసార్లు తన కాలర్ ఎత్తాడు. `వార్ 2` ని భారీ బ్లాక్ బస్టర్ గా తీర్చిదిద్దడం, ఆయన కోసం మన కాలర్ ఎత్తడం మన బాధ్యత! అని నాగ వంశీ ఫ్యాన్స్ ను ఉద్ధేశించి మాట్లాడారు.
యష్ రాజ్ ఫిలింస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన వార్ 2 హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఆగస్టు 14న అత్యంత భారీగా విడుదలవుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని అత్యంత భారీగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో కావాల్సినన్ని మలుపులు ట్విస్టులు ఉన్నాయి. వాటిని రివీల్ చేయొద్దని, వీడియోలు లీక్ చేయొద్దని కూడా తారక్ తన అభిమానులకు సూచించారు.