తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ తాజాగా ఫెడరేషన్ కి సహాయ నిరాకరణను ప్రకటించింది. తెలుగు సినిమా పరిశ్రమలోని 24 విభాగాల ఫెడరేషన్‌లోని అన్ని యూనియన్లు ఏకపక్ష సమ్మెకు పిలుపునిచ్చినందున వారితో చర్చలు లేదా సంప్రదింపులు చేయకుండా ఉండాలని సూచిస్తూ ఛాంబర్ ఒక నోట్ ని పంపింది. ఈ నిబంధన ఫిలింఛాంబర్ నుండి తదుపరి సూచనలు వచ్చే వరకు అమలులో ఉంటాయి.
స్టూడియోలు, ఔట్‌డోర్ యూనిట్లు, మౌలిక వసతుల యూనిట్ సభ్యులు కచ్ఛితంగా తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నుండి ముందస్తు సమాచారం పొందాల్సి ఉంటుంది. స్పష్టమైన అనుమతి లేకుండా ఫెడరేషన్ సంబంధిత సభ్యులకు ఎలాంటి సేవలూ అందించకూడదు అనే కఠినమైన ఆదేశాలు జారీ చేసింది ఛాంబర్. ముఖ్యంగా నిర్మాతలు , స్టూడియో విభాగ సభ్యులు ఈ విషయాన్ని అత్యంత గంభీరంగా తీసుకొని పూర్తిగా పాటించాలని ఫిలింఛాంబర్ తన విజ్ఞప్తిలో పేర్కొంది.
తాజా ప్రకటనను బట్టి ఫెడరేషన్ తో నిర్మాతల సమస్యలు పరిష్కృతం కాలేదని అర్థమవుతోంది. ఓ వైపు చర్చలు అంటూనే, మరోవైపు ఫిలింఛాంబర్ ఇలాంటి స్పెషల్ నోట్ పంపించడం వెనక మర్మం ఏమిటో అర్థం కానిది. ఐదు రోజులుగా సాగుతున్న సమ్మెను విరమింపజేయాలని మెగాస్టార్ చిరంజీవిని నిర్మాతలు కలిసిన సంగతి తెలిసిందే. కానీ ఇంకా ఈ వివాదానికి ముగింపు కనిపించడం లేదు.