హిందీ చిత్రసీమలో ప్రముఖ కథానాయకుడు అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్నా, తన సరసన వరుస చిత్రాల్లో నటించిన కథానాయికతో ప్రేమలో పడ్డారు. అంతేకాదు భార్య పిల్లలు ఉన్నా, ప్రేమించిన హీరోయిన్ ని పెళ్లాడాడు. కానీ ఈ పెళ్లి చట్టబద్ధంగా అధికారికమైనది కాదు. అయినా ఈ జంటకు పిల్లలు కూడా పుట్టారు. ఈ పిల్లలు కూడా పెద్దవారై, కొంతకాలం పాటు నటనలో కొనసాగి, తర్వాత పెళ్లి చేసుకుని భర్త పిల్లలతో సంతోషంగా సెటిలయ్యారు.
అయితే ఈ హీరో గత చరిత్ర గురించి ఎప్పుడూ గుసగుస వినిపిస్తుంది. అతడు రెండో పెళ్లి చేసుకున్నా ఆ నటితో కలిసి కాపురం చేయలేదు.. ఒకే ఇంట్లో జీవించలేదు.. అతడు ఇద్దరు భార్యలతో రెండిళ్ల పూజారిగా బాగానే బండి నడిపించాడని కూడా గుసగుసలు వినిపిస్తాయి. ఇక రెండో భార్య ఎప్పుడూ అతడిని వెనకేసుకు వస్తుంది.
తమ వివాహం చట్టబద్ధమైనది కాకపోయినా కానీ, అతడు ఎప్పుడూ పిల్లలను తక్కువగా చూడలేదని, వారికి కావాల్సినవన్నీ అందిస్తూ లోటు లేకుండా పెంచారని, సకాలంలో ఆడపిల్లల పెళ్లిళ్లు అవ్వాలని చాలా ఆందోళన చెందేవారని కూడా వెల్లడించారు. అతడు కుటుంబంలో ఒక భాగం. పిల్లలకు ఏ లోటూ రాలేదు. దాని గురించి చింత లేదు అని కూడా తెలిపారు.