`అవతార్` ఫ్రాంఛైజీలో ఇప్పటికే రెండు సినిమాలు 4 బిలియన్ డాలర్లు పైబడిన వసూళ్లతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ లో అవతార్ ఫ్రాంఛైజీలో మూడో సినిమా అవతార్ 3 (ఫైర్ అండ్ యాష్) విడుదలకు సిద్ధమవుతోంది. జేమ్స్ కామెరూన్ ఈ భాగాన్ని సుదీర్ఘ నిడివితో విడుదల చేస్తామని ప్రకటించారు. అవతార్, అవతార్ 2 చిత్రాల విజువల్స్ ని మించి భారీ యాక్షన్ పార్ట్ ని, వీఎఫ్ఎక్స్ మాయాజాలాన్ని ఈ మూడో భాగం నుంచి ఎక్స్ పెక్ట్ చేయొచ్చనే టాక్ ఉంది.
తాజాగా `అవతార్ - ఫైర్ అండ్ యాష్` (అవతార్ 3) అధికారిక ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ఆద్యంతం అద్భుతాల్ని ఆవిష్కరించారు కామెరూన్. ఎప్పటిలాగే ఈ మూడో భాగంలో కుటుంబ ఉద్వేగాలకు కొదవేమీ లేదు. కామెరూన్ కథ, ఫ్లాట్ లైన్ విషయంలో ఎక్కడా నేలవిడిచి సాము చేయలేదు. ఒక భయంకర విలన్ ని ఎదుర్కొనే జేక్ సుల్లీ - నితేయిరి, వారి వారసుడి కథను ఇందులో చూపిస్తున్నారు. ముఖ్యంగా జేక్ సుల్లి తనను తన కుటుంబాన్ని కాపాడుకుంటూనే తన తెగను రక్షించుకునేందుకు భయానక పోరాటాల్ని సాగిస్తున్నాడు. అతడు తన కుమారుడిని కోల్పోయే సన్నివేశం థియేటర్లలో ఉద్వేగానికి గురి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ట్రైలర్ లో సుల్లి కుటుంబ పోరాటాన్ని ఆవిష్కరించారు. అత్యంత బలమైన ప్రత్యర్థితో తలపడేవాడిగా జేక్ సుల్లి, అతడి కుటుంబం బలమైన ప్రత్యర్థితో పోరాడాల్సి వస్తోంది. అవతార్ 2 విడుదలైన దాదాపు మూడేళ్లకు ఈ మూడో భాగం విడుదలకు వస్తోంది. ట్రైలర్ లోని విజువల్ మాయాజాలం, అగ్ని దహనం వగైరా అంశాలు ఉద్విగ్నతను పెంచుతున్నాయి. 2025 డిసెంబర్ 16న `అవతార్ - ఫైర్ అండ్ యాష్` విడుదలవుతుంది. 20వ సెంచరీ స్టూడియోస్ ఇండియా సంస్థ ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం , కన్నడ భాషలలో విడుదల చేస్తుంది. 2029లో అవతార్ 4, 2031లో అవతార్ 5 చిత్రాలు విడుదల కానున్నాయి.