ఆడియో లేబుల్ కంపెనీల గుత్తాధిపత్యం, పెత్తందారీ తనాన్ని నిరసించడం చాలా అరుదు. ఫలానా ఆడియో కంపెనీ సరిగా చెల్లించదు! అన్న ఆరోపణలు పెద్దగా లేవు. కానీ ఇప్పుడు ప్రముఖ ఆడియో లేబుల్ సంస్థ అయిన టి-సిరీస్ తన సినిమాలకు మంచి మ్యూజిక్ కుదిరినా కానీ, ఆడియో రైట్స్ కి తక్కువ మొత్తం చెల్లించిందని ఆరోపించారు అనురాగ్ కశ్యప్.
అభిరుచి ఉన్న సంగీతానికి మంచి ధర చెల్లించరు. అందులో ఎలాంటి స్టార్లు నటించారు? అనేది చూసి టిసిరీస్ ఆడియో హక్కుల ధరల్ని చెల్లిస్తుందని తీవ్రంగానే ఆరోపించారు కశ్యప్. టి-సిరీస్, భూషణ్ కుమార్ ఆడియోను కొనుగోలు చేయకపోతే అది మంచి సంగీతం. టి సిరీస్ మంచి సంగీతాన్ని మంచి ధరకు కొనుగోలు చేయదు. వారు దేవ్ డి, గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ లేదా గులాల్ లకు చాలా తక్కువ చెల్లించారు. స్టార్ ఎవరు? అనేది చూసి మాత్రమే వారు చెల్లిస్తారు. నాణ్యమైన సంగీతానికి చెల్లించరు. దేవ్ డి సంగీతం కోసం వారు ఏమీ చెల్లించలేరు. నిర్మాతలను, యుటివి స్టూడియోలను అడగండి... వారికి మంచి సంగీతం అంటే ఏమిటో అర్థం కాలేదు. వారు ఒక టైప్ సంగీతానికి మాత్రమే చెల్లిస్తారు.. దాని కోసం మాత్రమే ఒత్తిడి చేస్తారు`` అని ఆరోపించారు. తన సినిమాల్లో బాంబే వెల్వెట్ కి అత్యధికంగా చెల్లించారని, పాటలు బావున్నా కానీ జాజ్ వినడానికి ఎవరూ ఇష్టపడలేదని కూడా తెలిపారు. అలాంటి సినిమా కోసం పెద్ద మొత్తం చెల్లించారు కానీ దేవ్ డి, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సంగీతానికి చెల్లించరు! అని ఆవేదన వ్యక్తం చేసారు కశ్యప్.
ఇంతకుముందే అనురాగ్ బాలీవుడ్ ని విడిచి పెట్టి పొరుగు పరిశ్రమలకు వెళ్లిపోయారు. బాలీవుడ్ విష సంస్కృతికి ఆయన విసిగిపోయానని అన్నారు. చాలా మంది హిందీ ఫిలింమేకర్స్ ఇండస్ట్రీ వదిలి విదేశాలకు పారిపోయారని కూడా అనురాగ్ బహిరంగంగా విమర్శించారు. తాను సినిమా వ్యక్తులకు దూరంగా ఉండాలనుకుంటున్నానని అన్నారు.