హిందీ చిత్రసీమ్ విజయాల్లేక పూర్తిగా డీలా పడిపోయిన ఈ క్లిష్ఠ సమయంలో పరిశ్రమను ఆదుకునేందుకు ఎవరో ఒకరు దేవుడిలా రావాలి. అలాంటి సమయంలో అతడు నేనున్నాను అంటూ ఆదుకుంటున్నాడు. కోవిడ్ తర్వాత అంతకంతకు దిగజారిన పరిస్థితుల్లో షారూఖ్ ఖాన్ రెండు పెద్ద విజయాలతో కొంతవరకూ ఆదుకున్నాడు. కానీ ఇతర హీరోలు ఎవరూ హిందీ చిత్రసీమను ఆదుకోలేకపోయారు. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వరస ఫ్లాపులతో పూర్తిగా రేసులో వెనకబడ్డారు.
అక్షయ్ కుమార్ డజను ఫ్లాపులతో మునకలు వేసాడు. ఇక లీడ్ లో ఉంటాడు అనుకున్న రణవీర్ సింగ్ సైతం పెద్ద ఫ్లాపులను ఎదుర్కొన్నాడు. హృతిక్ లాంటి హీరో రెండేళ్లకు ఒక సినిమా కూడా చేయడం లేదు. రణబీర్ కపూర్ కి యానిమల్ వచ్చే వరకూ చెప్పుకోవడానికి సరైన హిట్లు పడలేదు.
కానీ సైలెంట్ కిల్లర్ లా ఈ హిందీ హీరో మాత్రం వరుస విజయాలను అందుకుంటున్నాడు. దృశ్యం 2, రైడ్ 2 లాంటి సీక్వెల్ చిత్రాలతో బంపర్ హిట్లు కొట్టిన సీనియర్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ సైతాన్, సింగం ఎగైన్ చిత్రాలతోను బాక్సాఫీస్ వద్ద విజయాల్ని అందుకున్నాడు. సైతాన్ ఒక వైవిధ్యమైన హారర్ కంటెంట్ తో వచ్చి ఆకట్టుకుంది. సింగం ఎగైన్ లో దేవగన్ పవర్ ఫుల్ కాప్ పాత్రతో మెప్పించాడు. ఇక ఇటీవలే విడుదలైన రైడ్ 2 చిత్రం 200 కోట్లు వసూలు చేయడం హిందీ చిత్రసీమకు బిగ్ రిలీఫ్ నిచ్చింది. క్లిష్ఠ సమయంలో పరిశ్రమను ఆదుకుని దేవగన్ రేస్ లో పై మెట్టుపైకి వచ్చాడు.
అయితే అందివచ్చిన విజయాల్ని నిలబెట్టుకుంటూ, దేదే ప్యార్ దే 2, సన్ ఆఫ్ సర్దార్ 2, టోటల్ ధమాల్ చిత్రాలతోను సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాల్సి ఉంటుంది. సక్సెస్ ఎవరిని వరిస్తుందో వారి వెంట మాత్రమే పరిశ్రమ వస్తుంది గనుక, ఇక ఖాన్ ల కంటే దేవగన్ కే పరిశ్రమ పెద్ద పీట వేస్తుందనడంలో సందేహం లేదు. అయితే దేవగన్ లాంటి హీరోలకు కూడా మన సౌత్ హీరోలు ఇటీవల థ్రెట్ గా మారారనేది గుర్తించాలి.