మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప జూన్ 27 న పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి అగ్రనటులు కన్నప్ప లో అతిధి పాత్రల్లో కనిపించడం, మంచు విష్ణు అలాగే మంచు మోహన్ బాబు చేస్తున్న ప్రమోషన్స్ అన్ని ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచేస్తున్నాయి. తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ్ తో చేసిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు కన్నప్ప పదే పదే వాయిదా పడడానికి అసలు కారణాలు రివీల్ చేసారు.
అంతేకాదు కన్నప్ప బడ్జెట్, ప్రభాస్ తో కన్నప్ప ప్రయాణం అన్ని సంగతులను మంచు విష్ణు ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. కన్నప్ప విషయంలో తనకు అండగా నిలిచింది ప్రభాస్ అని, ప్రభాస్ కేరీర్లో కన్నప్పలో చేసిన రుద్ర పాత్ర మైలు రాయిగా మిగిలిపోతుంది.
కన్నప్ప కథ తనికెళ్ళ భరణి గారు చెప్పినప్పుడు ఇంప్రెస్ అయ్యాను, ఆయన దానిని భారీగా తియ్యమని చెప్పారు, మొదట రూ.100 కోట్ల లోపే బడ్జెట్ అవుతుందని అంచనా వేశాం. కానీ ఇప్పుడు చూస్తే ఖర్చు రెట్టింపు అయింది. శివుడి ఆశీస్సులు, నాన్నగారి ప్రోత్సాహంతోనే ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోంది. యూనిట్ సభ్యులంతా అండగా నిలిచారు.. అంటూ విష్ణు వారికి కృతఙ్ఞతలు తెలియజేసారు.
కన్నప్ప ఆలస్యానికి కారణం వీఎఫ్ఎక్స్ కోసం సరైన నైపుణ్యం లేని వ్యక్తిని తీసుకోవడమే తాను చేసిన పెద్ద తప్పని విష్ణు చెప్పుకొచ్చారు. వీఎఫ్ఎక్స్ పనుల వల్లే సినిమా కొంత ఆలస్యమైంది. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేసేందుకు మా బృందం అహర్నిశలు శ్రమిస్తోంది.. అంటూ విష్ణు కన్నప్ప ముచ్చట్లను ఆ ఇంటర్వ్యూలో షేర్ చేసారు.