గత ఏడాది ఎన్నికల్లో దారుణాతి దారుణంగా ఓడిపోయి ప్రస్తుత ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్న వైస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కుదిరితే తాడేపల్లి ప్యాలెస్, లేదంటే బెంగుళూరు ప్యాలెస్ అన్నట్టుగా ఏపీకి బెంగుళూరుకి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. అయితే 2024 ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆయన కార్యకర్తలను పట్టించుకోకుండా, కోటరీ మాటున తాడేపల్లి ప్యాలెస్ లో రెస్ట్ తీసుకుంటూ బటన్ ముఖ్యమంత్రిగా మారడమనే మాట వినిపించడమే కాదు, ఓడిపోయాక కూడా జగన్ కార్యకర్తలను పట్టించుకోవడం లేదు అనే మాట బ్లూ మీడియా నోట వినబడుతూనే ఉంది.
ఇక జగన్ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షమన్నదే లేకుండా చెయ్యాలని టీడీపీ నేతలపై కేసులు వేసి జైల్లో పెట్టి హింసించారు, అంతేకాదు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కొన్ని నెలలపాటు జైలుకి పరిమితం చేసారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్ చూపిన దారిలోనే చంద్రబాబు ప్రభుత్వం నడుస్తుంది. వైసీపీ నేతలు, సోషల్ మీడియా యాక్టీవిస్ట్ లపై కేసులు పెట్టి జిల్లాలో పడేసారు.
తాజాగా జగన్ తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ ని వదలము, వారికి సినిమా ఎలా చూపించాలో తెలుసు అంటూ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. వారెంత అన్యాయం చేయాలనుకుంటే అంత చేయమనండి, కొడతానంటే కొట్టమనండి.
కానీ... మీరు ఏ పుస్తకంలోనైనా వారి పేర్లు రాసుకోండి.. వాళ్ళకు సినిమా నేను చూపిస్తా అంటూ జగన్ ఆవేశంగా మాట్లాడారు.
ప్రతి కార్యకర్త కష్టాన్నీ చూస్తున్నా, వారందరికీ జగన్ 2.0లో ప్రాధాన్యత ఉంటుంది, కొడతానంటే.. కొట్టమనండి.. కానీ బుక్ లో పేర్లు రాసుకోండి, రిటైర్డ్ అయినా సరే లాక్కుని వస్తాం, దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే రప్పిస్తాం అన్యాయాలు చేసిన వారి సినిమా చూపిస్తాం అంటూ జగన్ రెచ్చిపోయి పోలీస్ అధికారులపై స్టేట్మెంట్స్ పాస్ చేసారు. ఈ సందర్భంగా మళ్లీ అధికారంలోకి వస్తామంటూ జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.