పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన మొదటి పాన్ ఇండియన్ మూవీ `హరి హర వీరమల్లు` రిలీజ్ ముందు సందిగ్ధతలు, డైలమాలు అభిమానుల్ని నిలవనీయడం లేదు. ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం ఎన్నో ఆలస్యాల నడుమ కూడా ఓపిగ్గా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఊహకందని ఎన్నో సమస్యలు, వ్యయప్రయాసలు, కష్టనష్టాల అనంతరం ఎట్టకేలకు వీరమల్లు థియేటర్లలోకి వస్తోందని నిర్మాత కళ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్నారు.
కానీ ఈ సినిమా ప్రారంభించిన ముహూర్త బలం ఎలా ఉందో కానీ, రిలీజ్ ముంగిట కూడా ఇది ఆపసోపాలు పడే పరిస్థితే కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించి రాజకీయాల్లోకి రావడం మొదలు అసలు ఈ సినిమా పూర్తవుతుందా లేదా? అనే సందిగ్ధతను ఎదుర్కొంది. పవన్ కాల్షీట్లు అందుబాటులో లేని కారణంగా చాలా కాలం పాటు వాయిదాల ఫర్వంలోనే ఈ చిత్రం తెరకెక్కింది. కొన్నిసార్లు ఆర్థికంగా చిక్కులు ఎదురయ్యాయని కూడా వార్తలు వచ్చాయి.
అయితే అన్నిటినీ అధిగమించి చివరికి సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేస్తుంటే త్వరలో టాలీవుడ్ బంద్ అంటూ బిగ్ బాంబ్ వేసారు. ఏపీ, తెలంగాణలోని ఎగ్జిబిటర్లు అంతా సమావేశమై, ఇకపై థియేటర్లను పర్సంటేజీ బేసిస్ లో మాత్రమే కట్టబెడతామని తీర్మానించడంతో దీనిపై చర్చా సమావేశాల పేరుతో మల్లగుల్లాలు పడుతున్నారు. దీనిని కొందరు మెజారిటీ ఎగ్జిబిటర్లు సమర్థిస్తున్నా, కొందరు బడా ఎగ్జిబిటర్లు, నిర్మాతలు వ్యతిరేకిస్తున్నారని, దీంతో ఇది ఎటూ తేలేట్టు లేదని చెబుతున్నారు.
ఈ ఆదివారం నాటి ఎగ్జిబిటర్ల సమావేశంలో జూన్ -1 నుంచి థియేటర్లను బంద్ చేయాలని కూడా నిర్ణయించారట. అద్దె విధానం గిట్టుబాటు కావడం లేదు, అందువల్ల పర్సంటేజీ విధానం అమల్లోకి తేవాలని, ఇది మల్టీప్లెక్స్ స్క్రీన్లతో పాటు సింగిల్ థియేటర్లకు వర్తింపజేయాలని ఎగ్జిబిటర్లు పంతం పడుతున్నారని తెలిసింది. అసలు ఈ సమస్య ఒక కొలిక్కి వస్తుందా లేదా? సినీపెద్దలు మాట్లాడి బంద్ ని ఆపగలరా లేదా? అన్నది వేచి చూడాలి.