ఆంధ్రప్రదేశ్ లో కొత్త టాలీవుడ్ పుడుతుంది! ఇంతకంటే పెద్ద జోక్ మరొకటి ఉందా? హైదరాబాద్ నుంచి సినీపరిశ్రమ అమరావతికి లేదా వైజాగ్ కి తరలి వెళ్లిపోతుందట. దీనిని మించిన జోక్ ఇంకొకటి ఉందా? కానీ ఇలాంటి జోకులు వేయడంలో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చాలా ముందుంటారు. ఆయన ప్రతిసారీ వేదికలపై లేదా మీడియా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం ఇది చేస్తాం.. అది చేస్తాం! అని ప్రకటిస్తుంటారు. ఇప్పుడు కూడా మరోసారి అలాంటి ప్రకటనతోనే ఆశ్చర్యపరిచారు.
ఆంధ్రప్రదేశ్ లోని సుందర నగరం విశాఖపట్నంలో కొత్త టాలీవుడ్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహకాల్లో ఉందని ప్రకటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దీనిపై సుదీర్ఘమైన ఆలోచనలు చేస్తున్నారని, తొందర్లోనే పరిశ్రమ పెద్దలు, కళాకారులు ఇతర శాఖలతో మంతనాలు సాగుతాయని కూడా వెల్లడించారు. ఏపీలో సహజసిద్ధమైన ప్రకృతి అందాలు ఉన్నాయి. కానీ మౌళిక వసతులు కల్పించాలి. షూటింగులకు అనువుగా మార్చాలి. ఇప్పటికే ఏపీలో షూటింగులు చేస్తున్నా కానీ దీనిని మరింత మెరుగు పరచాలి అని కూడా కందుల అన్నారు.
ఫిలింస్టూడియోలు, ఫిలింఇనిస్టిట్యూట్ లు, రికార్డింగ్ స్టూడియోలు వగైరా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అయితే వేదికలనెక్కినప్పుడు రొటీన్ గా ఇలాంటివి మాట్లాడటం కామన్. ఈసారి కూడా అలా రొటీన్ గానే మాట్లాడారా లేదా ఇందులో నిజం ఉందా? అన్నది తేలాలంటే చాలా కాలం వెయిట్ చేయాలి. పరిశ్రమ తరలిపోవడం అన్నది ఒక ప్రకటనతో జరిగే పని కాదు. సినీపెద్దల చిత్తశుద్ధి, నిజాయితీ, ఏపీ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు రాయితీలు, సబ్సిడీలతో భూములు ఇవ్వడాలు వగైరా క్రతువు కొనసాగాల్సి ఉంది.
తెలుగు దేశం ప్రభుత్వం చాలా కాలంగా ప్రకటనలు గుప్పిస్తున్నా రాజధాని సమస్యతోనే తలబొప్పి కట్టి లైట్ తీస్కుంది. జగన్ ప్రభుత్వం రమ్మన్నా సినీపెద్దలు కదిలి రాలేదు. ఈ పరిస్థితుల్లో ఏపీకి గ్లామర్ ఇండస్ట్రీ కలల్లోనే సాధ్యమని అంతా భావిస్తున్నారు.