తళా ది గ్రేట్. అతడు అనుకున్నది సాధించుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇటీవల `గుడ్ బ్యాడ్ అగ్లీ`తో హిట్టు కొట్టాడు. అంతకుముందే మోటార్ కార్ రేసింగ్‌లో వరుస విజయాలతో సత్తా చాటాడు. సినిమాల్లో నటిస్తూనే, రేసింగ్ లో తన అభిరుచి మేరకు రాణిస్తున్నాడు. రెండు పడవల పయనాన్ని సజావుగా సాగిస్తున్నాడు.
ఆసక్తికరంగా ఇప్పుడు అతడు తన వెయిట్ లాస్ జర్నీ గురించి చెప్పిన కొన్ని సంగతులు ఆశ్చర్యపరుస్తున్నాయి. తళా అజిత్ కేవలం 7 నెలల్లోనే 42 కేజీల బరువు తగ్గడం వెనక తాను పాటించిన టిప్స్ ని అభిమానుల కోసం షేర్ చేసాడు. మోటార్ రేసింగ్ కోసం పని చేయడం అంటే ఆత్మతో పని చేయాల్సి ఉంటుందని, కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పిన అజిత్, దానికోసం ముందు ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని అనుకున్నాడట. అనుకున్నదే తడవుగా అతడు ఆహార నియమాల్ని, అలవాట్లను మార్చుకున్నాడు. శాఖాహారం తిన్నాడు. కనీస మాత్రంగా మాంసాహారం ముట్టలేదు. మద్యం మానేశాడు. నిరంతరం ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేసాడు. కఠోరంగా శ్రమించాక అతడి బరువు ఏకంగా 42 కేజీలు తగ్గిపోయిందని చెప్పాడు.
నేను శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన ప్రతిదీ చేస్తున్నాను. సుదూర రేసులు చాలా సవాలుతో కూడుకున్నవి. విజయం సాధించాలంటే, నేను నా హృదయాన్ని, ఆత్మను రేసింగ్‌కు అంకితం చేయాలి. నేను ఇప్పుడు చేస్తున్నది అదే! అని అజిత్ చెప్పాడు. తళా 50 ప్లస్ వయసులో ఎంతటి సాహసం చేస్తున్నాడు? ఇది అందరికీ స్ఫూర్తినిచ్చే జర్నీ.