సోగ్గాడు, అందగాడు అయిన శోభన్ బాబు టాలీవుడ్ లో సుదీర్ఘ కాలం కథానాయకుడిగా కొనసాగారు. పరిశ్రమలో ఎంతో క్రమశిక్షణ కలిగిన నటుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. భారీ లేడీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ గాను ఇమేజ్ ఉంది. అయితే అలాంటి స్టార్ కుటుంబం నుంచి నటవారసులు ఎవరూ తెలుగు చిత్రసీమలో ప్రవేశించకపోవడం ఆశ్చర్యపరిచింది. మెగా ఫ్యామిలీ, నందమూరి ప్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, రెబల్ స్టార్ ఫ్యామిలీ నుంచి స్టార్లు ఉన్నారు. అగ్ర సినీకుటుంబాలతో పాటు ఇతర సినీప్రముఖుల వారసులు కూడా తెరకు పరిచయమయ్యారు. కానీ అందగాడు శోభన్ బాబు లెగసీని నడిపించే వారసుడు ఎందుకు రాలేదు? అన్న చర్చ చాలా కాలంగా ఉంది.
అయితే ఇటీవల శోభన్ బాబు మనవడు డా. సురక్షిత్ (కుమార్తె కొడుకు) మీడియా ఎదుటికి వచ్చారు. పలు తెలుగు మీడియా చానెళ్లు ఆయనను ఇంటర్వ్యూలు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిజానికి శోభన్ బాబుకు స్టార్ డమ్ అనేది అంత సులువుగా దక్కలేదని, ఆయన రేయింబవళ్లు శ్రమిస్తేనే ఇదంతా సాధ్యమైందని డాక్టర్ సురక్షిత్ చెప్పారు.
మీకు సోగ్గాడిగానే ఆయన తెలుసు. కానీ తాతయ్య ఎంత కష్టపడేవారో మాకు మాత్రమే తెలుసని అన్నారు. తనకు పదో తరగతి చదువుకునేప్పుడే నటనలోకి రావాల్సిందిగా ఆఫర్లు వచ్చాయని, కొందరు దర్శకనిర్మాతలు సంప్రదించారని కూడా డాక్టర్ సురక్షిత్ వెల్లడించాడు. కానీ తాను స్టడీస్ పై దృష్టి సారించానని తెలిపారు. సురక్షిత్ డాక్టర్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. నటనలోకి వచ్చే ఆలోచన లేదని కూడా వెల్లడించారు.