యంగ్ బ్యూటీ, అడివి శేష్ `కిస్` ఫేం ప్రియా బెనర్జీ ఇటీవలే బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంట చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. గత ఫిబ్రవరిలో వివాహం అయింది. అయితే ఈ పెళ్లికి ప్రతీక్ గాంధీ తండ్రి కానీ, అతడి కుటుంబం కానీ హాజరు కాలేదు. దీనిపై ఇండస్ట్రీలో చాలా గుసగుసలు వినిపించాయి.
ఎట్టకేలకు తన పెళ్లికి తండ్రి రాజ్ బబ్బర్, తన సవతి తల్లి, ఆమె వారసులు హాజరుకాకపోవడానికి కారణం ఉందని ప్రతీక్ తెలిపాడు. తన దివంగత తల్లి స్మితా పాటిల్ (రాజ్ బబ్బర్ రెండో భార్య) ఇంట్లో ఈ వివాహం జరిగింది. కానీ అమ్మ ఒంటరిగా జీవించింది. ఒంటరిగానే నన్ను పెంచింది. అలాంటి చోటికి నా తండ్రిని, వారి కుటుంబాన్ని పిలవడం అనైతికం అని భావించాను. నా తల్లితో ఆయన భార్యకు కొన్ని గొడవలు, కలతలు ఉన్నాయి. వారికి సరిపడదు. అందుకే పెళ్లికి పిలవడం సరికాదని భావించినట్టు ప్రతీక్ తెలిపాడు. అయితే తన తండ్రి రాజ్ బబ్బర్, సవతి సోదరులను పిలవకపోవడం వల్ల వారితో సంబంధాలు దెబ్బ తిన్నాయని కూడా వెల్లడించాడు. కానీ అది అర్థం చేసుకోవాల్సిన తరుణమని అన్నాడు.
అసలు గొడవేంటి?
రాజ్ బబ్బర్ - స్మితా పాటిల్ సంబంధం 80లలో బాలీవుడ్ మీడియాలో నిరంతరం హెడ్ లైన్స్ లో నిలిచింది. రాజ్ బబ్బర్ అప్పటికే నాదిరా బబ్బర్‌ను వివాహం చేసుకున్నాడు.. ఆర్య- జూహి అనే ఇద్దరు పిల్లలు వారికి ఉన్నారు. అతడు 1982లో వారి చిత్రం భీగీ పాల్కీన్ షూటింగ్ సమయంలో తోటి నటి స్మితా పాటిల్‌తో ప్రేమలో పడ్డాడు. అతడు నాదిరాను విడిచిపెట్టి స్మితను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఈ జంట నవంబర్ 1986లో వారి కుమారుడు ప్రతీక్‌ను స్వాగతించారు. విషాదకరంగా..ప్రసవం తర్వాత సమస్యల కారణంగా స్మితా పాటిల్ మరణించారు. ఆమె మరణం తర్వాత, రాజ్ బబ్బర్ నాదిరాతో రాజీ పడ్డాడు. ఇద్దరూ తిరిగి కలిసిపోయారు. కానీ ప్రతీక్ ఒంటరివాడయ్యాడు!