భల్లూకం పట్టు అంటేనే పీక్.. తెలుగు సినీపరిశ్రమలో కొందరు ఎగ్జిబిటర్లు ఈ తరహానే. ఒకసారి వారి హస్తగతం అయిన తర్వాత థియేటర్లను తిరిగి వెనక్కి తెచ్చుకోవడం ఓనర్ వల్ల కూడా కాదు. థియేటర్లకు కాంట్రాక్టులు ముగిసే లోగా కింకర్తవ్యం ఏమిటో ఆలోచించి ఇతరులను ఈ రంగంలోకి రానివ్వకుండా ఆపడంలో నిష్ణాతులున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎగ్జిబిషన్ రంగంలో ఇతరులు మనుగడ సాగించడం అసాధ్యం. ఈ రంగంలో పారదర్శకత కూడా పెద్ద సందేహమేనని ఆరోపణలు ఉన్నాయి.
టాలీవుడ్ ఎగ్జిబిషన్ రంగంలో పేరున్న బడా ఎగ్జిబిటర్లు ముగ్గురు కలిసి చాలా గేమ్ ఆడుతున్నారని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎగ్జిబిషన్ రంగాన్ని గుప్పిట పట్టేందుకు ఆ ముగ్గురూ వేయని ఎత్తుగడ లేదు. ఇప్పుడు కాంట్రాక్టులు ముగుస్తున్న సమయంలో ఒక కొత్త ఎత్తుగడను తెరపైకి తెచ్చారని తెలిసింది. థియేటర్లను అద్దె ప్రాతిపాదికన కాకుండా పర్సంటేజీ షేరింగ్ (లాభాల్లో వాటా) మోడల్ లో తమకు కట్టబెట్టాలని వీరంతా కోరుతున్నారట. అది కూడా సింగిల్ థియేటర్ల వోనర్లు దీనికి అంగీకరించాలని ఒత్తిడి తెస్తున్నారు. అయితే దీనికి థియేటర్ వోనర్లు అంగీకరించడం లేదు. అయితే ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు ఈ నెల 18న ఫిలింఛాంబర్ సారథ్యంలో ఎగ్జిబిటర్లతో సమావేశం ఏర్పాటు చేసారని తెలుస్తోంది.
అద్దె ప్రాతిపదికన పెద్ద సినిమాలను ఆడిస్తున్న ఎగ్జిబిటర్లకు పర్సంటేజీ మోడల్ కి మారితే తీవ్ర నష్టాలు ఎదురవుతాయని భయాందోళనకు గురవుతున్నట్టు తెలిసింది. కానీ మల్టీప్లెక్సుల రంగాన్ని ఏల్తున్న ముగ్గురు బడా ఎగ్జిబిటర్లు రింగ్ వేసి, సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్ల మాట చెల్లకుండా ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. తాము ఏది చెబితే అదే శాసనంగా మారాలని భావిస్తున్న ఈ ఎగ్జిబిటర్స్ కం బడా నిర్మాతల నుంచి సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిషన్ ని కాపాడాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనిపై మరో ఐదురోజుల్లో జరగనున్న సమావేశంలో పూర్తి స్పష్ఠత రానుంది.