తాగిన మైకంలో ఇల్లు ఒళ్లు తెలియదు! అన్నిటినీ మర్చిపోతారు.. ఈ ఆర్టిస్ట్ తాగి తాగి తూలి పడటమే కాదు.. పరిసరాల్లోని వ్యక్తులపై విరుచుకుపడతాడు. తాగి రచ్చ చేసి అరెస్టవ్వడం అతడికి పరమ రొటీన్. కానీ అతడు పదే పదే దీనిని రిపీట్ చేస్తుంటే పోలీసులు సీరియస్ గా ఉన్నారు. పరిశ్రమ సహచరులు అతడిని అసహ్యించుకుంటున్నారు.
గురువారం నాడు కేరళలోని ఒక హోటల్‌లో మద్యం మత్తులో విధ్వంసం సృష్టించాడనే ఆరోపణలతో మలయాళ నటుడు వినాయకన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తరువాత అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు. వినాయకన్ పదే పదే ఇదే సీన్‌ని రిపీట్ చేయడంపై పోలీసులు ప్రశ్నించారని సమాచారం. అతడు ఇలా అరెస్ట్ అవ్వడం మొదటిసారి కాదు. కొన్ని నెలల క్రితం తాగిన మత్తులో పొరుగువారిపై దుర్భాషలాడినప్పుడు అతడిని పోలీసులు మందలించారు.
ఇప్పుడు మరోసారి అతడు రెచ్చిపోయాడు. వినాయకన్ మే 2 నుండి తన సినిమా షూటింగ్ పరిసరాల్లోని ఒక హోటల్‌లో ఉన్నాడు. హోటల్ నుండి బయటకు వెళ్లేప్పుడు అతడు మద్యం మత్తులో గొడవ సృష్టించాడు. హోటల్ సిబ్బంది అతడిపై ఫిర్యాదు చేసారు. అంచలుమ్మూడు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన కొందరు పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అనంతరం అతడిని వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. ఆ తర్వాత కేరళ పోలీస్ చట్టంలోని సెక్షన్ 118 (ఎ) (బహిరంగ ప్రదేశంలో, మత్తులో కనిపించడం) కింద అతడిపై కేసు నమోదు చేసారు. బాగా తాగి ఉన్న అతడు హోటల్ సిబ్బందిపైనే కాదు, తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపైనా అరిచాడని పోలీసులు చెబుతున్నారు. చివరికి వినాయకన్ సహచరులలో ఒకరు పూచీకత్తు ఇవ్వడంతో బెయిల్‌పై విడుదలయ్యాడు. మద్యం మత్తులో వినాయకన్ రచ్చ పదే పదే రిపీటవుతుండడంతో ఈసారి పోలీసులు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు.