వేవ్స్ 2025 సమ్మిట్ లో సినీదిగ్గజాల విశ్లేషణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సినీరంగంలోని లెజెండ్స్ సలహాలు సూచనలు నిజంగా స్ఫూర్తిని నింపుతున్నాయి. చిరంజీవి, రజనీకాంత్, అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, నాగార్జున లాంటి దిగ్గజ హీరోలు వేవ్స్ లో తమ ప్రసంగాలతో ఎంతగానో ఆకట్టుకున్నారు. అమీర్ ఖాన్, షారూఖ్ సినిమా వ్యాపార సరళి గురించి మాట్లాడారు.
ఇప్పుడు కింగ్ నాగార్జున మాట్లాడుతూ దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లి భారీ వసూళ్లు సాధించిన సినిమాలను ఎంతగానో కీర్తించారు. ప్రభాస్ బాహుబలి, యష్ కేజీఎఫ్, అల్లు అర్జున్ పుష్ప ..ఇవన్నీ ఫ్రాంఛైజీ చిత్రాలుగా విడుదలై దక్షిణాది కంటే ఉత్తరాది నుంచి భారీ వసూళ్లను తెచ్చాయని నాగార్జున గుర్తు చేసారు. లార్జర్ దేన్ లైఫ్ పాత్రలను దర్శకులు ఎంపిక చేసుకున్నా కానీ నేల విడిచి సాము చేయలేదని మనదైన కథల్ని తెరపై అందంగా చూపించారని అన్నారు. కేవలం హీరోల ఎలివేషనే కాదు మంచి కథల్ని ఎంపిక చేయాలని సూచించారు. బాహుబలిని తెలుగులో తీసినా కానీ ప్రపంచవ్యాప్తంగా ఆదరించారని అన్నారు. కథలో స్థానికతకు రాజమౌళి గర్వించాడని కూడా అన్నారు. పుష్ప లాంటి సినిమాలు గతంలోను తెలుగులో వచ్చాయని నాగ్ అన్నారు. కానీ లార్జర్ దేన్ లైఫ్ పాత్రతో ప్రజల్ని మెప్పించారని ప్రశంసించారు.
ఉత్తరాదిన బీహార్, యూపీ, పంజాబ్ లాంటి చోట్ల ప్రజలు లార్జర్ దేన్ లైఫ్ పాత్రలను తెరపై చూడాలనుకుంటున్నారని, అలాంటి పాత్రలను ఈ దక్షిణాది చిత్రాలు తెరపై ఆవిష్కరించాయని నాగార్జున అన్నారు. ప్రజలు ఒత్తిళ్ల నుంచి రిలీఫ్ కోసం థియేటర్లకు వస్తారు. వారికి సూపర్‌హీరో పాత్రలు నచ్చుతున్నాయి. నాతో పాటు టికెట్ కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరూ తెరపై ఏదో ఒక మాయాజాలం కావాలని కోరుకుంటున్నాము. ప్రభాస్, బన్ని లాంటి స్టార్లు తెరపై కనిపిస్తే చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ కాసేపు నేను కూడా కాలక్షేపం చేస్తాను! అని నాగార్జున అన్నారు.