సినీతారలు స్టార్ డమ్ కి అనుగుణంగా పారితోషికాలు అందుకోవడంలోనే కాదు.. కొందరు తమ సంపాదనను తెలివైన పెట్టుబడులుగా మలిచి భారీ లాభాలార్జిస్తున్నారు. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ టాలీవుడ్ వరకూ ఇదే వరస.
స్మార్ట్ పెట్టుబడులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపార సంస్థల ద్వారా తారలు డబ్బు సంపాదిస్తున్నారు. సినిమాకు ఆకాశాన్ని అంటే పారితోషికాలు డిమాండ్ చేయడంలోనే కాదు, చాలా తెలివైన ఆర్థిక ప్రణాళికలతో స్కై ఈజ్ లిమిట్ అన్న చందంగా ఎదుగుతున్నారు.
తాజాగా పాపులర్ మ్యాగజైన్ ప్రపంచంలోని టాప్ 10 ధనిక నటుల జాబితాను ఆవిష్కరించింది. వీరంతా సినిమాలు, బ్రాండ్ ప్రచారాలతో పాటు వ్యాపార సామ్రాజ్యాల్ని విస్తరించిన దిగ్గజ నటులు. అయితే ఈ జాబితాలోని బాలీవుడ్ కింగ ఖాన్ పేరు అగ్రపథంలో నిలిచింది. అతడు ప్రపంచవ్యాప్తంగా నాల్గవ స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచంలోని అత్యంత సంపన్న నటులలో తన స్థానాన్ని నిలుపుకోవడమే కాకుండా, చాలా మంది అగ్ర హాలీవుడ్ స్టార్ల సంపదల్ని అతడు అధిగమించాడు.
కింగ్ ఖాన్ నికర ఆస్తుల విలువ $876.5 మిలియన్లు (రూ. 7400 కోట్లకు పైగా). మూడు దశాబ్ధాల కెరీర్ లో అతడు సంపాదనను తెలివైన పెట్టుబడులతో ఇంత పెద్ద సామ్రాజ్యంగా మలిచాడు. ఇటీవల పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో 2000 కోట్ల ఉమ్మడి కలెక్షన్స్ సాధించి బాలీవుడ్ లో ఏకైక బాక్సాఫీస్ కింగ్ అని నిరూపించాడు. షారూఖ్ ఐపీఎల్ పెట్టుబడులు, అనేక హై-ప్రొఫైల్ ఎండార్స్‌మెంట్ ఒప్పందాలతో భారీగా ఆర్జిస్తున్నాడు. అతడి రెడ్ చిల్లీస్ సామ్రాజ్యం వందల కోట్ల సంపదల్ని సృష్టిస్తోంది.
ప్రపంచంలోని టాప్ 10 ధనిక నటుల జాబితాలో టామ్ క్రూజ్ ($891 మిలియన్లు), డ్వేన్ జాన్సన్ ($1.19 బిలియన్లు), ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ ($1.49 బిలియన్లు) తర్వాత షారూఖ్ ఖాన్ పేరు జాబితాలో నిలిచింది. ఇతర ప్రముఖులు జార్జ్ క్లూనీ ($742.8 మిలియన్లు), రాబర్ట్ డి నీరో ($735.35 మిలియన్లు), బ్రాడ్ పిట్ ($594.23 మిలియన్లు), జాక్ నికల్సన్ ($590 మిలియన్లు), టామ్ హాంక్స్ ($571.94 మిలియన్లు), జాకీ చాన్ ($557.09 మిలియన్లతో జాబితాలో నిలిచారు.