బాలీవుడ్ లో చాలామంది స్టార్లు వ్యాపార రంగంలో భారీగా ఆర్జిస్తున్నారు. అమితాబ్- అభిషేక్ రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో భారీగా ఆర్జిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్, కపూర్ ఫ్యామిలీ స్టార్లు కూడా రియల్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టబుడులు పెట్టి లాభాలార్జించారు. అయితే కథానాయికల్లో అనుష్క శర్మ, ఆలియా, కత్రిన సహా పలువురు సినీనిర్మాణంలో ప్రవేశించడమే గాక, ఇతర బిజినెస్ రంగాల్లోను రాణిస్తున్నారు.
అయితే చాలా మంది కొలీగ్స్ కంటే ఆలస్యంగా వ్యాపార రంగంలో ప్రవేశించి కేవలం రెండేళ్లలో 1000 కోట్ల నికర విలువతో ఎంటర్ ప్రెన్యూర్ గా మారిన హృతిక్ రోషన్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. గ్రీక్ గాడ్ గా అభిమానుల హృదయాల్లో నిలిచిన హృతిక్ ప్రస్తుతం `వార్ 2`లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ ప్రతిష్టాత్మక సినిమాతోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. తదుపరి క్రిష్ ఫ్రాంఛైజీలో నాలుగో భాగానికి హృతిక్ స్వయంగా దర్శకత్వం వహిస్తారు. ఇంతలోనే ఇప్పుడు అతడి హెచ్.ఆర్.ఎక్స్ బ్రాండ్ విస్తరణపైనా ఫోకస్ చేసాడు.
నిజానికి హృతిక్ ఫేస్ వ్యాల్యూతో హెచ్.ఆర్.ఎక్స్ కంపెనీ యువతరంలో బాగా పాపులరైంది. కానీ ఈ కంపెనీని స్థాపించడం వెనక అసలు మెదడు హృతిక్ సహభాగస్వామి అఫ్సర్ జైదీ అనే విషయం ఇప్పటివరకూ ఎవరికీ తెలీదు. ప్రఖ్యాత హెచ్.ఆర్.ఎక్స్ బ్రాండ్ కి ముఖం హృతిక్ అయితే, మెదడు అఫ్సర్ జైదీ. ఆ మేరకు ప్రముఖ జాతీయ మీడియా తన కథనంలో అఫ్సర్ జైదీ తెలివితేటల్ని ప్రశంసించింది.