సింహాచలం అప్పన్న చందన మహోత్సవానికి భక్తులు పోటెత్తారు. అప్పన్నస్వామిని చందనోత్సవ వేళ దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. ఈరోజు బుధవారం ఉదయం అప్పన్న చందనోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులు టికెట్ల కోసం వేచి ఉన్న సమయంలో పక్కనే ఉన్న గోడ కూలి ఎనిమిది మరణించడం కలకలం సృష్టించింది.
ఆలయ ప్రాంగణంలోని రూ.300 టికెట్ క్యూలైన్ పక్కనే ఉన్న గోడ కూలి ఎనిమిది మంది భక్తులు మరణించడమే కాదు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సింహగిరి బస్టాండ్ నుంచి పైకి వెళ్లే రూట్‌లో కొత్త షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర గోడ కూలింది. 300 రూపాయల క్యూలైన్‌లో మెట్లు ఎక్కుతుండగా భారీ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
సింహాచలం అప్పన్న దర్శనానికి వచ్చి గోడకూలి భక్తులు మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందంటూ ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారీ వర్షాల కారణంగా ఊహించని ప్రమాదం జరిగిందని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.