యూపీఏ మాజీ చైర్మన్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆమె అనారోగ్య సమస్యలు మరింత పెరగకుండా ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే సోనియాను ఢిల్లీలో కాకుండా వేరే ఎక్కడైనా ఉంచాలని యోచిస్తున్నారట. ఈ క్రమంలోనే ఆమెను హైదరాబాద్‌కు షిఫ్ట్ చేయాలని భావిస్తున్నారట. సోనియా కూడా హైదరాబాద్‌కు వచ్చేందుకు సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. కాలం ఏదైనా సరే.. హైదరాబాద్‌లో అయితే ఇబ్బంది ఉండదు. మండు వేసవిలో కూడా ఉష్ణోగ్రతలు ఇబ్బందికరంగా మారవు.
కాలుష్యభరిత వాతావరణంలో ఉండటం సరికాదు..
కొన్నేళ్లుగా సోనియా గాంధీ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆమె దీనికోసం న్యూయార్క్‌లో చికిత్స పొంది కాస్త కోలుకున్నారు. అయినప్పటికీ అనారోగ్య సమస్యలు ఆమెను వేధిస్తూనే ఉన్నాయి. వయసు కూడా మీద పడటంతో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. 77 ఏళ్ల వయసులో ఆమె ఇవన్నీ తట్టుకోవడం చాలా కష్టం అలాగే ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం ఉంటుంది. ఊపరితిత్తుల సమస్య ఉన్న ఆమె కాలుష్యభరిత వాతావరణంలో ఉండటం సరికాదని వైద్యులు సూచించారట. ఈ కాలుష్యం కారణంగా సోనియాకు ఊపరితిత్తుల సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు సూచించారట. అయితే తొలుత ఆమెను బెంగుళూరుకు తరలించారని భావించారట.
అప్పుడు ఢిల్లీకి మారాలా? వద్దా?
అయితే బెంగుళూరుతో పోలిస్తే హైదరాబాద్ అన్ని విధాలుగా బాగుంటుందని.. కాలుష్యం కూడా చాలా తక్కువని రాహుల్, ప్రియాంకలు డిసైడ్ అయ్యారట. పైగా నగర శివారులో వాతావరణం చాలా బాగుంటుందని.. కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి సెక్యూరిటీ పరంగా ఇబ్బంది కాదని భావిస్తున్నారట. ఆరోగ్యం కుదుట పడితే అప్పుడు ఢిల్లీకి మారాలా? వద్దా? అనేది నిర్ణయిస్తారట. ప్రస్తుతానికైతే చలికాలం వెళ్లే వరకూ హైదరాబాద్‌లోనే ఉండాలని సోనియా నిర్ణయించుకున్నారట. ఆపై 15 రోజులకొకసారి ఢిల్లీ వెళ్లాలనుకుంటున్నారట. దీనికి సంబంధించిన పార్టీకి చెందిన అగ్రనేతలతో మంతనాలు జరిపారగ. కావల్సిన సెక్యూరిటీ, వైద్య సదుపాయాలపై ఆరా తీశారట. ఇక మంచి ఇల్లు దొరికితే చాలు.. సోనియా హైదరాబాద్‌కు షిఫ్ట్ అయినట్టేనని సమాచారం.