టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా.. పెద్దన్న ఉంటూ ఎలాంటి సమస్యలు తన దృష్టికి వచ్చినా పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. గతంలో ఇలాంటి పనులన్నీ దివంగత నేత, దర్శకుడు దాసరి నారాయణ చూసేవారు. ఆయన మరణాంతరం ఇండస్ట్రీలో ‘క్యాస్టింగ్ కౌచ్’, ‘మా’లో విబేధాలతో పలు విషయాల్లో గొడవలు జరిగాయ్.. అయితే పైకి చిరు పేరు రాకున్నప్పటికీ అన్ని సమస్యలను ఆయనే పరిష్కరించారనే టాక్ నడిచింది. అంతేకాదు.. ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా సరే పరిష్కరించేలా చిరు అడుగులేస్తున్నారు.
మొదటి ప్రకటన..
తాజాగా.. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అందరి కంటే ముందుగా తన ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం.. ఆ తర్వాత యావత్ సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయన వెంటే నడటంతో ఆయనలోని పెద్దరికం బయటపడింది. అంతేకాదు.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ఎలాంటి ప్రకటన రాకమునుపే థియేటర్స్ అన్నీ మూసివేస్తున్నట్లు, షూటింగ్స్, రిలీజ్‌లు సర్వం బంద్ చేయాలని మొదట నిర్ణయించింది కూడా మెగాస్టారే కావడం విశేషమని చెప్పుకోవచ్చు. ఆ తర్వాతే ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడం ఇవన్నీ తెలిసిన విషయాలే.
తన వంతుగా..
కేవలం షూటింగ్స్‌తోనే టాలీవుడ్ మిన్నకుండిపోలేదు.. ఆ తర్వాత నటీనటులు తమ వంతుగా సూచనలు, సలహాలు చేస్తూ.. తెలుగు రాష్ట్రాలను ఆదుకోవడానికి తోచినంత విరాళాలు కూడా అందజేశారు. ఈ విషయంలోనూ మెగాస్టార్ తన మంచి మనసు చాటుకుని కోటి రూపాయిలు సినీ కార్మికులకు విరాళంగా ప్రకటించారు. వాస్తవానికి అందరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరాళాలు ప్రకటించగా చిరు మాత్రం మొదట మన కళాకారులు అంటూ వారి కడుపు నింపడానికి.. వారికి చేయూత నివ్వడానికి నడుం బిగించగా.. పలువురు ఆయన్ను ఆదర్శంగా తీసుకుని అదే బాటలో నడిచారు.
ఇలా చెప్పుకుంటూ పోతే..
వీటన్నింటికంటే ముఖ్యంగా కరోనా నేపథ్యంలో కార్మికుల కోసం విరాళాలు సేకరించేందుకు గాను ‘సిసిసి మనకోసం’ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సీసీసీకిగాను పలువురు నటీనటులు తమ వంతుగా సాయం ప్రకటించారు. అలా.. మెగాస్టార్ చిరంజీవి ప్రతి విషయంలోనూ ట్రెండ్‌ను సెట్ చేస్తూ వస్తున్నాడు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కరోనా జాగ్రత్తలపై వీడియోలు చేస్తూ ప్రజల్లోనూ చైతన్య పరుస్తున్నారు. ఇటీవలే కోటి పాటిన పాటలోనూ తన వంతుగా పాలుపంచుకున్న చిరు ప్రజలను చైతన్య పరుస్తూ ముందుకెళ్తున్నారు. ఇలా ప్రతి విషయంలోనూ చిరు కలుగజేసుకుని టాలీవుడ్‌కు దాసరి లేని లోటును తీరుస్తున్న చిరు.. మున్ముంథు మరెన్నో మంచి కార్యక్రమాలతో ముందుకెళ్లాలని www.cinejosh.com ఆశిస్తూ.. సలాం చేస్తోంది.!