పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకల్లో విషాదం
Mishap In Pawan Kalyan Birthday Celebrations
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల కోసం ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీ ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. అమలాపురంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ తీగ తగలడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
అమలాపురంలోని ఓ కళాశాల సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బెండమూర్లంకకు చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి నిర్వహించేందుకు స్వగ్రామానికి వచ్చిన అతడు.. ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు.
విద్యుత్ వైరు తగలడంతో ప్రేమ్ కుమార్‌కు తీవ్ర షాక్ తగిలింది. అక్కడికక్కడే మృతి చెందినట్లు తాజా సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
పుట్టినరోజు సందర్భంగా అభిమానుల సందడి ఒకవైపు కొనసాగుతుండగా.. అమలాపురంలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే సమయంలో విద్యుత్ తీగల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.







































