మెగా బర్త్‌డే: అన్నయ్య ఇమేజ్ ఎవరెస్ట్ శిఖరమంత
Megastar Birthday Special
ఆయన వ్యక్తిత్వం.. ఆలయ శిఖరం
ఆయన ఇమేజ్.. ఎవరెస్ట్ శిఖరం
ఆయన విశిష్టత.. సమున్నత సేవా శిఖరం
జీవితపయనంలో కెరీర్ పోరాటంలో తగిలిన రాళ్లనే `పునాది రాళ్లు`గా చేసుకుని.. తన కెరీర్ సౌధాన్ని స్వయంగా నిర్మించుకున్న అసాధారణ `స్వయంకృషీ`వలుడు మెగాస్టార్ చిరంజీవి.
ఈ భూమ్మీద మనిషి ప్రాణానికి ఎవరూ ఖరీదు కట్టలేరు.. అలాగే పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చే శక్తి కూడా ఎవరికీ లేదు. కాబట్టి అత్యవసర సమయాల్లో ప్రాణాపాయంలో ఉన్నవారు కేవలం రక్తం అందక చనిపోకూడదనే ఉద్దేశంతో, దాదాపు 27 ఏళ్లుగా రక్తదాన రంగాన్ని ఒక మహోద్యమంగా మెగాస్టార్ ముందుకు నడిపిస్తున్నారు. ఈ సత్కార్యం తో ఎంతోమంది ప్రాణాలను కాపాడి, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నిజమైన విజేత ఆయన.
అందుకే ఆయన వ్యక్తిత్వం ఒక దేవాలయ శిఖరమంత పవిత్రమైనది... ఆయన ఇమేజ్ ఎవరెస్ట్ శిఖరమంత ఉన్నతమైనది! ఈరోజు (22 ఆగస్టు) మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా.. ఒకసారి మైలురాళ్లను పరిశీలిస్తే..
మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం కేవలం ఒక నటుడి విజయగాథ మాత్రమే కాదు.. అది నిరంతర శ్రమకు .. పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం. `స్టార్ అయి చూపిస్తానుఅని మనసులోనే శపథం చేసుకుని పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన.. సుదూరంలో ఉన్న విజయాలను సొంతం చేసుకుంటూ `ఖైదీ చిత్రంతో బాక్సాఫీస్ స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పారు. సీనియర్ నటుల కాంబినేషన్‌లో చిన్న చిన్న పాత్రలు చేసినా తనకంటూ ఒక ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌ను, నటనా శైలిని ఏర్పరచుకుని ప్రేక్షకుల- దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించారు.
స్వయంకృషి- పట్టుదలే ఆయన్ను ఈరోజు జగదేకవీరుడిగా నిలబెట్టాయి. ఎదురైన ఎన్నో సవాళ్లను, సంఘర్షణలను తన క్రమశిక్షణతో ఎదుర్కొంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ సినీ సామ్రాజ్యానికి అన్‌క్రౌన్డ్ కింగ్‌గా మారారు. మూడున్నర దశాబ్దాలుగా ఆయన విజయ ప్రస్థానాన్ని ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఆయన సాధించిన విజయాలు తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా.. భవిష్యత్ తరాలకు పెద్ద దిక్సూచిలా మారాయి.
కేవలం తెరపై మెప్పించడమే కాకుండా సమాజంపై అత్యంత బాధ్యత కలిగిన మహోన్నత వ్యక్తిగా చిరంజీవి నిలిచారు. రక్తం అందక ఎవరూ చనిపోకూడదనే ఉద్దేశంతో 1998లోనే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థాపించి విప్లవాత్మకమైన రక్తదాన ఉద్యమాన్ని ప్రారంభించారు. తన అభిమాన సైనాన్ని సేవామార్గం వైపు మళ్లించి.. ఆపదలో ఉన్నవారికి ఆదుకునేలా ఛానలైజ్ చేయడం ఆయన సాధించిన అతిపెద్ద విజయం. తుఫానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు లేదా ఇటీవల వయనాడ్ బాధితుల సహాయార్థం కోటి రూపాయలు విరాళం ఇవ్వడం వంటివి ఆయన సేవా నిరతికి అద్దం పడతాయి.
చిత్రసీమలో పెద్దలని గౌరవించడం, చిన్నవారిని ఆదరించి ప్రోత్సహించడం చిరంజీవిలోని మరో గొప్ప సుగుణం. శ్రీకాంత్, తరుణ్ కాలం నుండి నేటి యంగ్ టాలెంట్ వరకు ఎవరు మంచి నటన కనబరిచినా ప్రత్యేకంగా ఇంటికి పిలిపించుకుని అభినందిస్తారు. ఇది నూతన నటీనటులకు, దర్శకులకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుంది. అంతేకాకుండా.. తాను నమ్మిన చిన్న చిత్రాలైన హనుమాన్, కమిటీ కుర్రోళ్ళు వంటి సినిమాలను స్వయంగా ప్రమోట్ చేసి ఆ సినిమాలు భారీ విజయాలు సాధించడంలో తనవంతు సహాయం చేసారు.
నటుడిగా విలక్షణమైన పాత్రలను ఎంచుకోవడంలో చిరంజీవి ఆయనకు ఆయనే సాటి. రుద్రవీణ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు, ఆరాధన వంటి కళాత్మక చిత్రాలతో నంది పురస్కారాలను సొంతం చేసుకున్నారు. ప్రయోగాత్మక చిత్రాలు తీసినప్పుడు కమర్షియల్ వినోదం లోపిస్తే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సైకిల్ స్టాండ్ నిర్వహించే చిన్న వ్యాపారులు నష్టపోకూడదనే విశాల హృదయంతో ఆయన ఎక్కువగా మాస్ ఎంటర్‌టైనర్ చిత్రాలకే ప్రాధాన్యం ఇచ్చారు.
బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించడం... వాటిని మళ్లీ తానే బ్రేక్ చేయడం ఆయనకు అలవాటుగా మారింది. ఘరానా మొగుడు చిత్రంతో పది కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ నటుడిగా చరిత్రకెక్కారు. ఆ సమయంలో ఆయన అందుకున్న పారితోషికం ఆధారంగా ఉత్తరాది పత్రికలు ఆయన్ను బిగ్గర్ దాన్ అమితాబ్ బచ్చన్ అని కవర్ స్టోరీలు రాయడం తెలుగు చిత్రసీమకు దక్కిన అరుదైన గౌరవం. ప్రతిబంధ్, ఆజ్ కా గూండారాజ్ వంటి సినిమాలతో ఆ రోజుల్లోనే పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
తన సినిమాల ద్వారా వినోదాన్ని పంచడమే కాకుండా.. సామాజిక సందేశాన్ని కూడా సమర్థవంతంగా అందించారు. ఠాగూర్, స్టాలిన్, శంకర్ దాదా M.B.B.S వంటి చిత్రాలు సమాజంలో మార్పుకు దోహదపడటమే కాకుండా, ప్రజల మనస్తత్వాల్లో పాజిటివ్ ఆలోచనలను నింపాయి. సినిమా వినోదంతో పాటు సామాజిక స్పృహను జోడించి సినిమాలు తీయడం మెగాస్టార్‌కే చెల్లింది.
ఆయన రాజకీయ ప్రవేశం అభిమానులను కొంత కలవరపెట్టినా రాజకీయ చదరంగం కంటే అమాయకత్వం, భోళాతనమే ఎక్కువ ఉన్న చిరంజీవి తిరిగి తన సొంత గూడైన సినీ కళామతల్లి చెంతకే చేరారు. రీ-ఎంట్రీలో ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాలతో మళ్లీ తన విజయయాత్రను కొనసాగిస్తూ.. ఇప్పటికీ అదే ఎనర్జీతో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. విశ్వంభర, మెగా 158 చిత్రాలతోను తన హవా కొనసాగించేందుకు మెగాస్టార్ సంసిద్ధంగా ఉన్నారు.
-జర్నలిస్ట్ ఆర్.డి.ఎస్.ప్రకాష్







































