స్నేహనికి ప్రాణం పెట్టే అల్లు అర్జున్
Allu Arjun's Friendship Day Message
సినిమా రంగంలో విజయం మన చుట్టూ ఉన్న చాలా విషయాలను మార్చేస్తుంది. ఈ క్రమంలో మన కెరీర్‌లు మారుతాయి. మన బంధాలు, సంబంధాల సమీకరణాలు మారిపోతాయి. స్నేహాలు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అయితే నిజమైన విజయం అంటే కేవలం అత్యుతన్న స్థానాన్ని చేరుకోవడం మాత్రమే కాదని..మనవాళ్లను కూడా మనతో పాటు తీసుకెళ్లడమే అని గుర్తు చేసే వారుంటారు. అలాంటి అరుదైన వ్యక్తే అల్లు అర్జున్. ఆయన ఎలాంటి హంగామా లేకుండా నిశ్శబ్దంగా అదే చేసి చూపించారు.
కొన్ని నెలల క్రితం అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో AA23 చిత్రాన్ని ప్రకటించినప్పుడు, సహజంగానే అందరి దృష్టి ఆ ప్రాజెక్ట్ భారీ స్థాయిపై పడింది. అయితే అందులో ఒక చిన్న విషయం బన్నీ వ్యక్తిగతమైన భావాన్ని తెలియజేసింది. అదేంటంటే AA23 చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు, అల్లు అర్జున్‌కు అత్యంత సన్నిహితమైన నలుగురు స్నేహితులు ఈ సినిమాకు సహ నిర్మాతలుగా మారారు. ఇది కేవలం ఒక ప్రొడక్షన్ క్రెడిట్ మాత్రమే కాదు. ఇది స్నేహానికి ఇచ్చిన ఒక బలమైన సందేశం.
అల్లు అర్జున్ AA23 సినిమా కోసం సహ నిర్మాతలుగా మారిన స్నేహితుల్లో బన్నీ వాస్ కూడా ఉన్నారు. అల్లు అర్జున్ జీవితంలోనూ, కెరీర్‌లోనూ ఎన్నో దశల్లో అతని పక్కన నిలిచిన స్నేహితుడాయన. అలాగే ఈ ప్రాజెక్ట్‌లో ఆయన స్కూల్ డేస్‌లో స్నేహితులైన సందీప్ రామినేని, నటరాజ్ కూడా చేరారు. వీరితో పాటు అతని కజిన్, చిన్ననాటి స్నేహితురాలు స్వాతి కూడా భాగమయ్యారు. వీరి స్నేహ బంధం పేరు, రికార్డులు, పాన్ ఇండియా విజయాల కంటే చాలా ముందే మొదలైంది.
సక్సెస్ తర్వాత మన అనుకున్న వాళ్లని దూరం పెట్టే ఈ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ మాత్రం అవకాశాలను సృష్టించే దారిని వారితోనే ఎంచుకున్నారు. అల్లు అర్జున్ ఇలా చేయటం ఇదేం మొదటిసారి కాదు. పుష్ప ది రైజ్ సినిమా సమయంలో తన మావయ్యకు చెందిన సంస్థ ముత్తంశెట్టి మీడియా చిత్ర నిర్మాణంలో భాగమైంది. అలాగే బన్నీ స్నేహితులైన ఎస్‌కెఎన్, శరత్‌లు ఇప్పటికే సక్సెస్‌ఫుల్ నిర్మాతలుగా రాణిస్తున్నారు. ఇలా అల్లు అర్జున్ ఎదిగే కొద్దీ, తనతో పాటు తనకు అత్యంత దగ్గరగా ఉన్న వాళ్లను కూడా ఎదగనివ్వాలని చూసే ఒక స్థిరమైన దృక్పథం ఇందులో కనిపిస్తుంది. అదే బహుశా ఫ్రెండ్‌షిప్ డే అసలు స్ఫూర్తి.
స్నేహం అంటే కేవలం పాత జ్ఞాపకాలను గుర్తుకు చేసుకోవటం మాత్రమే కాదు. అందరూ కలిసి కొత్త మైలురాళ్లను సృష్టించడం కూడా. ప్రపంచం నమ్మకముందే మన మీద నమ్మకం పెట్టుకున్న వాళ్లను మనం నమ్మడం కూడా అదే. కోట్లాది మంది అభిమానులు అల్లు అర్జున్‌ను ఓ ఎంటర్‌టైనర్‌గా అభిమానిస్తారు. కానీ ఇలాంటి కథలు ఆయనలోని మరో కోణాన్ని చూపిస్తాయి. విజయం ఎంత విలువైనదో, నమ్మకాన్ని కూడా అంతే విలువైనదిగా భావించే వ్యక్తి బన్నీ. లక్ష్యాలను సాధించటంతో పాటు సంబంధాలను, పేరు ప్రఖ్యాతులతో పాటు స్నేహాలను కూడా సమానంగా కాపాడుకునే మనిషి. ఎందుకంటే చివరికి, బ్లాక్‌బస్టర్ సినిమాలు రికార్డులను సృష్టిస్తాయి. కానీ కానీ స్నేహం శాశ్వతమైన గుర్తింపును సృష్టిస్తుంది.








































