ఎస్ జానకి మృతి: చిరు-బాలయ్య సంతాపం

గాన కోకిల, ఇండియన్ నైటింగేల్ గా పిలవబడే ఎస్.జానకి ఈరోజు మైసూర్ లోని కార్డియాక్ అరెస్ట్ తో మైసూర్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూయడం అందరిని దిగ్బ్రాంతికి గురి చేసింది. జానకి మరణ వార్త విని పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం తెలుపుతున్నారు.
చిరంజీవి:
జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది.
నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే.
నా కెరీర్‌లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు...
ఆ జ్ఞాపకాలు... మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి.
జానకమ్మ గారు ఒక గాయని మాత్రమే కాదు... భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం... ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధం.
ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది.
శ్రీమతి ఎస్. జానకి గారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
జానకమ్మ గారు... మీ స్వరం ఎప్పటికీ అమరం.
ఓం శాంతి. 🙏
నందమూరి బాలకృష్ణ:
గాన కోకిల, లెజెండరీ సింగర్ శ్రీమతి ఎస్. జానకి అమ్మగారు ఇక లేరనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
తన మధురమైన గళంతో దశాబ్దాల పాటు కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన జానకి అమ్మగారు ఇక లేరనే వార్త యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. మా నాన్నగారు, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి చిత్రాలతో పాటు.. నా చిత్రాలలోనూ ఆమె పాడిన ఎన్నో అమర గీతాలు ఎప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉంటాయి. మా కుటుంబంతో ఆమెకు ఎంతో దశాబ్దాల అనుబంధం ఉంది.
తన అద్భుతమైన గాత్రంతో భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర వేసిన జానకి అమ్మగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు మరియు అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి! 🙏







































