100 కోట్ల మైలురాయి చేరలేదని ఆవేదన

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన `లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ` (LIK) ఇటీవల ఓటీటీలోకి వచ్చిన సందర్భంగా.. దర్శకుడు సినిమా బాక్సాఫీస్ ఫలితంపై స్పందించారు. ఈ చిత్రం కనీసం 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరుతుందని.. డబుల్ ట్రిపుల్ కలెక్షన్స్ ఆశించామని.. గతంలో ప్రదీప్ అందుకున్న వరుస విజయాల జోరును కొనసాగిస్తుందని భావించానని.. కానీ అది సాధ్యం కాకపోవడం తనను కొంత బాధకు గురిచేసిందని విఘ్నేష్ శివన్ పేర్కొన్నారు. నిజానికి తాను 200 కోట్ల వసూళ్లను ఆశించానని.. కానీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 66 కోట్ల నుంచి 70 కోట్ల గ్రాస్ వద్దే సినిమా ఆగిపోయిందని నిజాయితీగా అంగీకరించారు. సినిమాపై ఆశించిన స్థాయిలో ప్రశంసలు రాకపోయినా.. ఈ చిత్రాన్ని విడుదల చేయడమే తన పాలిట ఒక గొప్ప విజయంగా భావిస్తున్నట్లు విఘ్నేష్ ఎమోషనల్ అయ్యారు.
సినిమా ఫలితంపై స్పందిస్తూ... బాక్సాఫీస్ లెక్కల కంటే ఈ ప్రాజెక్ట్ కోసం తాను చేసిన అదృశ్య పోరాటాలు.. పడ్డ కష్టం తనను గర్వపడేలా చేస్తున్నాయని విఘ్నేష్ తెలిపారు. మిశ్రమ సమీక్షలు వచ్చినా.. థియేటర్లకు వచ్చి సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. తన తప్పుల నుండి నిరంతరం నేర్చుకుంటానని పేర్కొన్న విఘ్నేష్‌కు... ఆయన భార్య .. చిత్ర నిర్మాత నయనతార సోషల్ మీడియా వేదికగా మద్దతుగా నిలిచారు. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి, ఎస్.జె. సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ చిత్రం ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది.








































