ఆర్థిక నేరస్థుల కోసం రంగంలోకి దిగే హీరోలెంతమంది?

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ ది స్క్రీన్ లోనూ హీరోనే. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేపట్టిన ప్రత్యేక అవగాహన ప్రచారానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మనీ లాండరింగ్, పన్ను ఎగవేత వంటి ఆర్థిక నేరాలు దేశాభివృద్ధికి పెద్ద ఆటంకాలని వీటి వల్ల సామాన్య ప్రజలే పరోక్షంగా నష్టపోతున్నారని అజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే ఇలాంటి అక్రమ చర్యలకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఏకమవ్వాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. సాధారణంగా సెలబ్రిటీలు ప్రభుత్వ సంస్థల కార్యకలాపాల్లో జోక్యం చేసు కోవడానికి సంకోచిస్తుంటారు. కానీ అజయ్ దేవగన్ దేశ హితం కోరే విషయాల్లో ఎప్పుడూ ముందే ఉంటారు. ఈడీ వంటి సంస్థలు చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసిస్తూనే యువత అక్రమ సంపాదన వైపు వెళ్లకుండా చట్టాన్ని గౌరవించాలని ఆయన హితవు పలికారు.
ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పెరుగుతోన్న తరుణంలో ఆర్థిక నేరగాళ్లు కొత్త దారులు వెతుక్కుంటున్నారని ఇలాంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. దీనిలో భాగంగా చిత్ర పరిశ్రమ నుంచి హీరోలు సహా అంతా భాగమవ్వాలన్నారు. దీంతో బాలీవుడ్ సహా ఇతర పరిశ్రమల నుంచి ఈడీకి మద్దతుగా ఎంత మంది ముందుకొస్తారో? చూడాలి. గతంలో అక్రమ ఆస్తులు, పన్ను ఎగవేతల విషయాల్లో పలువురు సెలబ్రిటీలు ఈడీ విచారణని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.








































