దళపతి విజయ్ నటించిన `జననాయగన్` అంతా సవ్యంగా సాగితే, సంక్రాంతి బరిలో విడుదలై ఉండేది. కానీ సినిమాకి సెన్సార్ చిక్కులు వచ్చి పడటంతో అది ఎప్పటికి విడుదలవుతుందో కూడా తేలని పరిస్థితి. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉంది.
కోర్టు గొడవ తేలకపోవడంతో దాదాపు 500 కోట్ల మేర తమకు నష్టం వాటిల్లుతోందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేసారు. ఒక్క రిలీజ్ డే ఏకంగా 100 కోట్లు నష్టపోయినట్టేనని నిర్మాత ఆవేదన చెందడం సోషల్ మీడియాల్లో కలకలం రేపింది. అయితే ఇప్పటికైనా సెన్సార్ క్లియరెన్స్ వచ్చినట్టేనా? సుప్రీం కోర్టు ఏమని తీర్పు వెలువరించింది? అంటే... మరోసారి `జననాయగన్`కి చుక్కెదురైందని తెలుస్తోంది. హైకోర్టులో విచారణలో ఉన్నందున తాము దీనిలో జోక్యం చేసుకునేది లేదని సుప్రీం తేల్చి చెప్పింది. ప్రస్తుతం హైకోర్ట్ డివిజినల్ బెంచ్ దీనిపై తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈనెల 20న తుది తీర్పు వెలువడే రోజు. కానీ తమకు సెన్సార్ సర్టిఫికేషన్ క్లియర్ చేయాల్సిందిగా నిర్మాతలు సుప్రీంకి అప్పీల్ కి వెళ్లగా, అక్కడ చుక్కెదురైంది.
తాజా విచారణ ప్రకారం... జనవరి 20న విచారణ జరిపి, వీలైనంత త్వరగా తుది నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో మరోసారి సీబీఎఫ్‌సి తన పంతాన్ని నెగ్గించుకునేందుకు అవకాశం చిక్కింది. నిజానికి మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ సినిమాకు యుఏ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును ఆదేశించగా, సెన్సార్ బోర్డు అప్పీల్ చేయడంతో డివిజన్ బెంచ్ ఆ తీర్పుపై స్టే విధించింది. దీంతో పండగ రేసులో జనవరి 9 రిలీజ్ కావాల్సినది వాయిదాపడింది. ఇప్పుడు 20జనవరి హైకోర్ట్ తీర్పు కోసం అందరూ వేచి చూస్తున్నారు. దళపతి విజయ్ సినిమాలు వదిలేసి, పూర్తి రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఇది బిగ్ జోల్ట్.




సంక్రాంతి సినిమాల పెరఫార్మెన్స్
Loading..