విజయ్‌ కేరాఫ్‌ రామారావు రివ్యూ

Fri 14th Nov 2025 09:29 AM
vijay c/o rama rao  విజయ్‌ కేరాఫ్‌ రామారావు రివ్యూ
Vijay C/O Rama Rao Review విజయ్‌ కేరాఫ్‌ రామారావు రివ్యూ
Advertisement
Ads by CJ

నిజంగా చెప్పాలంటే ఈ మధ్యరోజుల్లో ఎమోషనల్‌గా ఇంత హార్డ హిట్టింగ్‌ కంటెంట్‌ చూడలేదు. సెంటిమెంట్, క్లీన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, రివల్యూషనరీ ..,,,,ఏదైనా తీయాలంటే ఈటివి విన్‌ ప్లాట్‌ఫాంకే చెల్లింది. మొన్నీ మధ్యే ఈటివి విన్‌ యాప్‌లో వస్తున్న కథాసుధ సీరీస్‌లో వెలువడిన విజయ్‌ కేరాఫ్‌ రామారావు అనే మినీ ఫిల్మ్‌ చూస్తే ఒక్కసారి కుటుంబాలలో జరుగుతున్న గుండెను పిండే సంఘటనలు కళ్ళ ముందు గిర్రున తిరుగుతాయి. భార్య పోయిన తాతయ్య ఇంటికొస్తే, ఒంటరివాడని కూడా ఆలోచించకుండా తిరుగుటపాలో వెనక్కి పంపించేసిన మనవడు ఈ తరంలో చాలామందికి ఒక లైవ్‌ ఎగ్జాంపుల్‌. అయితే ఈ తత్వం ఎలా వచ్చింది ఇందులో హీరో విజయ్‌కి? చిన్నతనం నుంచి నీ గొడవ నువ్వు చూసుకో, ఎవర్నీ పట్టించుకోకు అని ఈ మైక్రో ఫ్యామిలీస్‌లో తల్లితండ్రులు నూరిపోస్తే పిల్లలు ఇలాగే తయారవుతారనే చేదు నిజానికి విజయ్‌ కేరాఫ్‌ రామారావు ఓ సజీవ నిదర్శనం. 

విజయ్‌ నిజానికి మంచి కుర్రాడే. కానీ తన ఉద్యోగంలో ఇబ్బందులు, జాబ్‌ డిమాండ్స్‌, తన తల్లి అనారోగ్యం అన్ని వైపుల నుంచి చుట్టుముట్టినప్పుడు ఇంకొకరి అదనపు బాధ్యతను స్వీకరించాలనే స్పృహ అటోమేటిక్‌గానే కోల్పోయిన క్యారెక్టర్‌ మాత్రమే విజయ్‌ది. తాతది చాదస్తమే. కానీ పాపం అమ్మమ్మ పోయింది, తాత ఒంటిగా బాధలు పడుతున్నాడు, ఆదరాభిమానాలు కరువైపోయి, కటకటలాడుతున్నాడనే అనే పరిశీలన అందని ఉక్కిరిబిక్కరి కుర్రతనం విజయ్‌ సమస్య. ఆదినుంచి కటువుగా, చాదస్తంతో బతికిన తత్వం తాతది. ఈ రెండు తరాల మధ్యన జరిగే ఈ కథలో పర్యవసానం, పరిణామం ఏంటంటే తాతని మనవడు ఇంటినుంచి పంపించేసిన సన్నివేశం! ఈ సీన్‌ చూస్తే అప్రయత్నంగానే కళ్ళు చెమ్మగిల్లుతాయి. అలా తనింటికి తానే వెళ్ళిపోయిన తాత ఆస్తిని మాత్రం పోయేముందు మనవడి పేరన రాసి కన్నుమూశాడన్న సీన్‌ దగ్గర ఆ మనవడే  భోరుమన్నప్పుడు బంధాలు ఎంత బలమైనవో ఎంతటి కఠోరమైన మనసున్నవాడికైనా గుండె కరిగిపోక మానదు. పిల్లల పెంపకంలో తలిదండ్రులు చేసే పొరబాట్లు కుటుంబాలలో బంధాలనే బలి తీసుకుంటాయని చెప్పడానికి ఈ మినీ మూవీ ఓ స్ట్రైకింగ్‌ ఎగ్జాంపుల్‌. అయితే ఇందాక చెప్పినట్టుగా ఇటువంటి ఆర్ద్రమైన కంటెంట్‌ని ప్రోత్సహించాలంటే ఈటీవిలాంటి అత్యున్నత ప్రమాణాలున్న సంస్ధకి మాత్రమే సాధ్యం అనిపిస్తుంది. 

దర్శకుడిగా, ఇందులో మనవడు పాత్ర రెండింటినీ అర్ధవంతంగా, సమర్ధవంతంగా అత్యంత చాకచక్యంగా నిర్వహించిన పివిఎన్‌ కార్తికేయని తప్పనిసరిగా మెచ్చుకోవాలి. మనవడి క్యారెక్టర్‌లో ఎంతో బాగా రాణించాడు. దర్శకత్వంలో ప్రతీ ఫ్రేమ్‌లోనూ, ప్రతీ షాట్‌లోనూ కథనీ, కథలో క్యారెక్టర్ల ఎమోషన్‌ చాలా సీరియస్‌గా హేండిల్‌ చేశాడు కార్తికేయ. ముఖ్యంగా బ్రిటిష్‌ డాలర్‌ సీన్‌ కేవలం కొన్ని క్షణాలు మాత్రమే రన్‌ అవుతుంది. కానీ ఆ కొన్ని క్షణాలు తాత క్యారెక్టర్‌ని ఎంతో ఎలివేట్‌ చేశాయి. బ్రిటిష్‌ సైన్యాలకే భయపడని ఓ భారతీయ వీరసైనికుడు మనవడు గానీ ఇంట్లో నుంచి పంపించేస్తాడేమోనని భయపడ్డాడని తల్లి చెబుతుంటే భలే షాకింగ్‌గా అనిపిస్తాయి ఆ డైలాగ్‌ అండ్ ఆ సీన్‌. పంజరంలో చిలకకి కూడా ఇందులో సెంటిమెంట్‌ని కేరీ చేసే ఓ ప్రత్యేకమైన రోల్‌ దొరికింది, అదీ ఇందులో మరో హైలైట్‌.

ఏకాకిగా మిగిలి, ఏజ్‌ ప్రాబ్లమ్‌తో ఢీలా పడిన తాత తన సొంత కూతురు ఇంటి నుంచే మనవడి కారణంగా వెళ్ళిపోవాల్సివచ్చినప్పుడు సైతం మనవడి మంచి కోరే డైలాగ్‌ ఓ పెద్ద సినిమాకి కావాల్సిన పెరఫెక్టు ఎలిమెంట్‌ అనిపించక మానదు. కేవలం 40 నిమిషాల లోపు నిడివిలో ఓ పెద్ద కాన్వాస్‌ ఉన్న కంటెంట్‌ అంత సంక్షిప్తంగా చెప్పగలగడం కేవలం డైరెక్టర్‌ మెరిట్‌ మాత్రమే అవుతుంది. రాశి లాంటి ఓ ప్రముఖ నటి తల్లి పాత్రను పోషించడంతో రెండు జనరేషన్ల మధ్య కట్టుదిట్టమైన వారధిగా ఆ క్యారెక్టర్‌ చెప్పలేనంత ప్రాముఖ్యతని సంతరించుకుంది. మయసభ వెబ్‌ సీరీస్‌లో వైయస్‌ రాజారాడ్డి పాత్రతో తిరుగులేని పాప్యులారిటీని సంపాదించుకున్న శంకర్‌ మహంతి తాత పాత్రను పండించిన తీరు ఎంతో రక్తి కట్టింది. ఇటువంటి కథాంశాన్ని తెరమీదకి తెచ్చిన బాపినీడు చౌదరి, ఈటివి కంటెంట్‌ హెడ్‌ నితిన్‌, సాయికృష్ణని మెచ్చకోవాలి. డీవోపి చరణ్‌, సంగీతం అందించిన ఈశ్వర్‌ చంద్‌ వర్క్ టోటల్‌గా అభినందనీయం.

దానాదీనా, విజయ్‌ కేరాఫ్‌ రామారావు ఒక హార్డ్‌ హిట్టింగ్‌ ఎమోషన్‌. గుండెను కలచివేసే అనుభవం. గబుక్కుమని మరచిపోలేని బాధ.

Vijay C/O Rama Rao Review:

Vijay C/O Rama Rao Review

Tags:   VIJAY C/O RAMA RAO
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ