నేపాల్ బాధితులతో లోకేష్ ఫోన్ కాల్
ప్రస్తుతం నేపాల్ లో పరిస్థితిలు చేతులు దాటి పోతున్నాయి. అక్కడి అధికారం ఆర్మీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. జెన్ జడ్ నిరసనలు హింసాత్మకంగా మారడంతో అక్కడి పరిస్థితి అదుపుతప్పింది. ఆందోళనల మధ్య పోఖారాలో, ఇంకా నేపాల్ లో పలువురు భారతీయులు అందులోను ఏపీ కి సంబందించిన తెలుగు వారు చిక్కుకున్నారు. నేపాల్‌లో ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉంది, రోడ్లపై ఎక్కడ చూసినా అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి.
ఈనేపథ్యంలో ఏపీ విద్య, ఐటి మినిస్టర్ నారా లోకేష్ అనంతపురం పర్యటనను రద్దు చేసుకుని నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడేందుకు రంగంలోకి దిగారు. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా వెనక్కి తీసుకరావడమే ఏకైక అజెండా గా నారా లోకేష్ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ మేరకు అధికారులు సమన్వయంతో వ్యవహరించి అవసరమైన చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.
నేపాల్ లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ఏపీ భవన్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో విద్య, ఐటీ, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. నేపాల్ లో ఇప్పటివరకు 215 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు సమాచారం ఉందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. వీరంతా నేపాల్ లోని వివిధ ప్రదేశాల్లో సురక్షితంగా ఉన్నారని, వీరితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. నేపాల్ లోని బఫాల్, సిమిల్ కోట్, పశుపతి నగరం, పింగలస్థాన్ లో వీరంతా ఉన్నారని వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని వివిధ మార్గాల ద్వారా సంప్రదించి.. కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వారికి ఆహారం, భద్రతకు సంబంధించి ప్రతి రెండు గంటలకు ఒకసారి మానిటరింగ్ చేయాలి. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారు రాష్ట్రంలోని ఏయే ప్రాంతాలకు చెందిన వారు, వారి సమగ్ర వివరాలతో కూడిన సమాచారాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు.
ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నెంబర్లను అందుబాటులో ఉంచాలని, కలెక్టర్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. నేపాల్ లో చిక్కుకున్న పలువురు తెలుగువారితో మంత్రి లోకేష్ ఫోన్, వీడియో కాల్ ద్వారా మాట్లాడి వారిలో భరోసా నింపారు. నేపాల్ లో చిక్కుకున్న పలువురు తెలుగువారితో మంత్రి నారా లోకేష్ ఫోన్, వీడియో కాల్ ద్వారా మాట్లాడారు.
ఈ సందర్భంగా విశాఖకు చెందిన సూర్యప్రభతో మాట్లాడిన మంత్రి లోకేష్.. నేపాల్ లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారని, అక్కడ అందబాటులో ఉన్న సౌకర్యాలపై మంత్రి వాకబు చేశారు. తాము ముక్తినాథ్ దర్శనానికి వెళ్లి నేపాల్ లో చిక్కుకుపోయామని, ప్రస్తుతం ఓ హోటల్ లో సురక్షితంగా ఉన్నామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండాలని, బయటకు రావొద్దని, ప్రతి రెండు గంటలకు అధికారులు మీతో సంప్రదిస్తారని భరోసా ఇచ్చారు. కేంద్రంతో మాట్లాడి ప్రత్యేక విమానాల ద్వారా రాష్ట్రానికి సురక్షితంగా తీసుకువస్తామని వారిలో ధైర్యం నింపారు.