టాలీవుడ్ కమెడియన్, బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ లోబోకి ఓ కేసులో ఏడేళ్ల తర్వాత ఏడాది జైలు శిక్షతో పాటు 12వేల 500 రూపాయల జరిమానాను కోర్టు విధించింది. అసలు లోబో కి జైలు శిక్ష ఎందుకు విధించారు అంటే.. లోబో ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమయ్యాడనే ఆరోపణలతో జనగామ కోర్టు ఏడాది జైలు శిక్షను లోబోకి విధించింది.
గతంలో అంటే 2018 మే 21న ఓ టీవీ ఛానల్ తరఫున వీడియో చిత్రీకరణ కోసం లోబో ఇంకా అతని బృందం తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు, వేయిస్తంభాల ఆలయం తదితర ప్రాంతాల్లో పర్యటించింది. ఆతర్వాత లోబో స్వయంగా కారు నడుపుతూ వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా.. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఎదురుగా వచ్చిన ఆటోను లోబో కారు తో ఢీకొట్టగా ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో మృతి చెందారు.
ఆటో ని ఢీ కొట్టిన లోబో ప్రయాణిస్తున్న కారు కూడా బోల్తా పడటంతో లోబోతో పాటు ఉన్న వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఆ ప్రమాదం జరిగిన సమయంలో మృతుల కుటుంబ సభ్యులు లోబో పై రఘునాథపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ కేసు ఏడు సంవత్సరాల విచారణ తర్వాత తాజాగా జనగామ కోర్టు తీర్పు వెలువరించింది. ఇద్దరి మృతికి కారణమైన లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు 12వేల 500 రూపాయల జరిమానాను విధిస్తూ తీర్పునిచ్చింది.