రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ సినిమాల్లో ఒకటి - రంగస్థలం. నటన పరంగా అతడి దాహం తీర్చిన సినిమా కూడా ఇదే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గోదారి కుర్రాడిగా చరణ్ నటించాడు. గోదారి మత్స్యకారుల కుటుంబంలోని అన్నదమ్ముల కథను సుక్కూ అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. గోదారి పల్లె పట్టు అందాలను, స్థానిక భాష, యాస, వేషధారణలతో రక్తి కట్టించాడు. అన్నదమ్ములుగా నటించిన ఆది - చరణ్ తో పాటు, సమంత, అనసూయ సహా పలువురి నటనకు ప్రశంసలు కురిసాయి. ఈ సినిమా జాతీయ అవార్డులను కూడా అందుకుంది.
అయితే రంగస్థలం సీక్వెల్ తెరకెక్కనుందని చాలా కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ సుకుమార్ కి ఇప్పటివరకూ వీలు పడలేదు. అతడు అల్లు అర్జున్ కథానాయకుడిగా పుష్ప, పుష్ప 2 చిత్రాలను రూపొందించేందుకు ఐదారేళ్ల సమయం తీసుకున్నాడు. అందుకే చాలా గ్యాప్ తర్వాత ఇప్పటికి రంగస్థలం సీక్వెల్ పై దృష్టి సారించేందుకు అవకాశం దొరికిందని చెబుతున్నారు. సుకుమార్ వెకేషన్ ని పూర్తి చేసుకుని బౌండ్ స్క్రిప్ట్ ను రెడీ చేసేందుకు సిద్ధమవుతున్నాడని తెలిసింది. ఇప్పటికే అతడి రచయితల టీమ్ కథ, స్క్రిప్టుపై పని చేస్తోంది. సుకుమార్ త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టుపై దృష్టి సారిస్తాడని తెలిసింది. దసరా తర్వాత చరణ్ కి స్క్రిప్టును వినిపించే అవకాశం ఉందని తెలిసింది. సహజంగానే తన స్క్రిప్టు పనుల కోసం ఇబిజ, దుబాయ్ లాంటి ఎగ్జోటిక్ లొకేషన్లను సుక్కూ ఎంపిక చేసుకుంటారు. ఈసారి దుబాయ్ కి వెళ్లేందుకు అవకాశం ఉందని కథనాలొస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి పుకార్లు మాత్రమే. చిత్రబృందం అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.