బాలీవుడ్ కపుల్ శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా లు తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు. వివాదం అనే కన్నా కేసు అంటే బావుంటుందేమో.. గతంలో బ్లూ ఫిలిం కేసులో రాజ్ కుంద్రా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు, ఆ కేసులో శిల్పాశెట్టి ఆస్తులను ఈడీ జప్తు చేసింది కూడా. ఆ తర్వాత మరో కేసు వీరిని వెంటాడింది. తాజాగా శిల్పాశెట్టి దంపతులు పై మరో చీటింగ్ కేసు నమోదు అయ్యింది.
ముంబైకి చెందిన బిజినెస్ మెన్ దీపక్ కోఠారి తనను శిల్పాశెట్టి దంపతులు పెట్టుబడి పేరుతో మోసం చేశారని ఆరోపించడం హాట్ టాపిక్ అయ్యింది. పెట్టుబడి పేరుతో 60.4 కోట్లకు మోసం చేశారనే ఆరోపణలపై శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై ఆర్థిక నేరాల విభాగం అధికారులు వీరిపై కేసు నమోదు చేసింది. ఈ సంఘటనకు సంబంధించి మరో గుర్తు తెలియని వ్యక్తిపై కూడా దీపక్ కొఠారి ఆరోపణలు చేశారు.
రాజేష్ ఆర్య అనే వ్యక్తి తనను శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాకు పరిచయం చేశాడని, ఆ సమయంలో వారు హోమ్ షాపింగ్ , ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫామ్ అయిన బెస్ట్ డీల్ టీవీకి డైరెక్టర్లుగా ఉన్నారని, ఆర్య కంపెనీ కోసం 12% వార్షిక వడ్డీ రేటుకు ₹75 కోట్ల రుణం కోరినట్లు కొఠారి తెలిపారు. అయితే టాక్స్ భారాన్ని తగ్గించుకొవడానికి తనను కూడా పెట్టుబడి పెట్టాలని వారు కోరినట్లు కొఠారి చెప్పాడు. వారి మాటలు నమ్మి 2015 ఏప్రిల్‌లో రూ.31.95 కోట్లు, జూలై 2015, మార్చి 2016 మధ్య రూ.28.54 కోట్లు బదిలీ చేసినట్లు చెప్పారు.
కొన్ని నెలల తర్వాత శిల్పాశెట్టి కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఆతర్వాత కంపెనీపై రూ. 1.28 కోట్ల దివాలా కేసు బయటపడింది. ఈ విషయాల్ని తనకు తెలియకుండా దాచారని దీపక్ కొఠారి షాకింగ్ విషయాలు బైటపెట్టాడు.