భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, దేవుళ్ల చరిత్ర కథల ఆధారంగా పుట్టుకొచ్చిన రామాయణం, మహాభారతం వంటి పురాణేతిహాసాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. శ్రీరాముడి రంగు రూపం, ఆంజనేయుడి తోకను కాపీ కొట్టి జేమ్స్ కామెరూన్ అవతార్ తెరకెక్కించాడు. మన కథను తీసుకొని వేల కోట్లు ఆర్జించాడు. ఎవెంజర్స్ కథల్లో సూపర్ హీరోలు అందరూ మన ఆంజనేయుడి స్ఫూర్తితో పుట్టుకొచ్చిన వాళ్లే. హాలీవుడ్ వాళ్లు బిలియన్ డాలర్లు వసూలు చేస్తారు. మన కథల్ని మనకే అమ్మి లేదా తెరపై విజువల్ గా చూపించి వంద కోట్లు పైగా భారతదేశం నుంచి కొల్లగొడుతున్నారు.
కానీ అవే కథల్ని లేదా పాత్రల్ని తెలుగులో ఉన్న అనేక మంది ప్రతిభావంతులైన ఫిలింమేకర్స్, క్రియేటివ్ రైటర్లు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు? అన్నది ఎప్పుడూ ఒక జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. రామాయణం, మహాభారతం కథల ఆధారంగా క్లాసిక్ డేలో మన వెటరన్ ఫిలింమేకర్స్ సినిమాలు తీసి అద్భుత విజయాలు సాధించారు. కానీ నేటితరానికి పురాణేతిహాసాలపై కనీస అవగాహన లేకపోవడం సమస్యగా మారుతోంది. అయినా అవగాహన లేని కథలపై సినిమాలు ఎవరు తీస్తారు? ఎందుకు తీస్తారు? ఎలా తీయగలరు?
ఇప్పుడు భారతదేశంతో పాటు, ప్రపంచ దేశాల్లో పురాణాలు గొప్ప గౌరవాన్ని అందుకుంటున్నాయి. ఈ సమయంలో కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఎంతో తెలివిగా మహావతార్ పేరుతో ఫ్రాంఛైజీని ప్రారంభించి ఇందులో మొదటి సినిమాని రిలీజ్ చేసి హిట్టు టాక్ తెచ్చుకుంది. ఉగ్ర నరసింహస్వామి అవతారాన్ని, హిరణ్యకశిపుడు, భక్త ప్రహ్లాదుని అద్భుత కథను ఎలివేట్ చేస్తూ యానిమేటెడ్ సినిమా తీసిన ఘనతను దక్కించుకున్నారు. నిజానికి భక్త ప్రహ్లాద పేరుతో తెలుగు సినిమా దశాబ్ధాల క్రితమే వచ్చింది.
ఇంటింటా తెలుగు నాట అందరికీ తెలిసిన కథ ఇది. అలాంటి మహోన్నతమైన కథను మన తెలుగు ఫిలింమేకర్స్ క్యాచ్ చేయలేకపోయారు. ఒక మహోన్నతమైన కథను తెలుగు ట్యాలెంట్ ఎన్ క్యాష్ చేయలేకపోయారనేది ఆవేదనతో కూడుకున్నది. విజయలక్ష్మి అలియాస్ సిల్కు స్మిత కథను ఏక్తా కపూర్ ఎత్తుకెళ్లినంత సులువుగా, ఇప్పుడు భక్త ప్రహ్లాద కథను హోంబలే ఫిలింస్ ఎత్తుకెళ్లింది. డర్టీ పిక్చర్ పేరుతో ఏక్తా కపూర్ 100 కోట్లు కొల్లగొట్టగా, ఇప్పుడు హోంబలే ఫిలింస్ ప్రహ్లాదుడు, నరసింహస్వామి కథలతో మహావతార్ హిట్ టాక్ తో దియెటర్లు పెరిగి ఏమేరకు కొల్లగొడతారో వేచి చూడటం తప్ప చేసేదేమీ లేదు!
4000 వేల కోట్ల తో రామాయణ బాలీవుడ్ లో మరో సినిమా రాబోతుంది. మరి మన వాళ్ళు కళ్ళు తెరుసుకొని హితిహాసాల పై దృష్టి పెడితే మంచి మంచి కధలు దొరుకుతాయి, మంచి సినిమాలు వస్తాయి.
-పర్వతనేని రాంబాబు✍️