వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న నటుడు ఫిష్ వెంకట్ మృతి చెందారని వార్తలు వస్తున్నాయి. సీనియర్ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారని, ఎవరినీ గుర్తించలేకపోతున్నారని కథనాలొచ్చాయి. అతడి రెండు కిడ్నీలు పని చేయడం లేదని కథనాలొచ్చాయి. కిడ్నీలు మార్చాలని వైద్యులు సూచించారు. కానీ అందుకు తమ కుటుంబ ఆర్థిక స్థితి సహకరించదని ఆయన సతీమణి మీడియాకు చెప్పారు. పరిశ్రమ నుంచి ఆర్థిక సాయాన్ని అర్థించారు.
అయితే ఫిష్ వెంకట్ కష్టం గురించి తెలుసుకున్న మెగా కుటుంబం తొలిగా లక్షల్లో విరాళాలు అందజేసింది. చిరంజీవి, రామ్ చరణ్ సహా పవన్ కల్యాణ్ ఫిష్ వెంకట్ కుటుంబానికి చికిత్స కోసం లక్షల్లో విరాళాలు అందించారు. విశ్వక్ సేన్ సహా పలువురు స్టార్లు అతడు కోలుకునేందుకు ఆర్థిక సాయం అందించారు. అయితే అప్పటికే పరిస్థితి దిగజారింది. తాజా సమాచారం మేరకు ఫిష్ వెంకట్ మృతి చెందారు. ఈ వార్త విన్న తర్వాత అతడి సహచరుల నుంచి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తమవుతోంది. పలువురు సంతాపం తెలియజేసారు. ఫిష్ వెంకట్ ఆది, సింహాద్రి లాంటి చిత్రాలతో గుర్తింపు వచ్చింది. గబ్బర్ సింగ్ లో అతడి నటనకు మంచి పేరొచ్చింది. కామెడీ విలన్ గా అతడు సుమారు 100 పైగా చిత్రాల్లో నటించారు.