ఒక పెద్ద నిర్మాణ సంస్థ భారీ థియేట్రికల్ ప్లాన్స్ తో ఒక సినిమాని నిర్మించి, దానికోసం కోట్లాది రూపాయల బడ్జెట్ ని ఖర్చు చేసి, ఆపై సడెన్ గా ప్లాన్ మార్చి ఓటీటీలో రిలీజ్ చేస్తే దానిని ఏమనాలి? ఆ సినిమా సరిగా రాలేదు. లేదా కంటెంట్ నిరాశపరిచి ఉండాలి. కొనుగోలు దారుల్లో ఆసక్తిని పెంచే కంటెంట్ లేకపోవడం ప్రధాన కారణం కావొచ్చు. కానీ ఇవేవీ లేకుండానే అసలు ఆ సినిమా ఎలా ఉంటుందో స్పష్ఠత లేకుండానే, థియేట్రికల్ రిలీజ్ ఆలోచనను వదిలేసి నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు లైన్ క్లియర్ చేయడం ఆశ్చర్యపరుస్తోంది.
రాజ్ కుమార్ రావు నటించిన భూల్ చుక్ మాఫ్ చిత్రాన్ని ఈ వారంలో థియేట్రికల్ గా విడుదల చేయాల్సి ఉండగా, చిత్రనిర్మాణ సంస్థ మడాక్ ఫిలింస్ యూటర్న్ తీసుకుని ఓటీటీ డీల్ కుదుర్చుకుంది. థియేట్రికల్ గా సినిమాని రిలీజ్ చేయడం లేదని, సినిమా ఓటీటీలో డైరెక్టుగా రిలీజవుతుందని ప్రకటించేసింది.
ఈ ఆకస్మిక నిర్ణయం చిత్రబృందాన్ని షాక్ కి గురి చేసింది. కేవలం ఒక గంటలోనే మడాక్ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంది. అయితే మడాక్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో పరిశ్రమలోని చిన్న నిర్మాతలంతా ఖంగు తిన్నారు. మడాక్ సంస్థ పరిమిత బడ్జెట్ సినిమాని ఓటీటీకి సేల్ చేయడం ద్వారా సేఫ్ గేమ్ ఆడిందని అంతా భావిస్తున్నారు. అంత పెద్ద నిర్మాణ సంస్థ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో, తమ పరిస్థితి ఏమిటో అనే సందిగ్ధత ఇతర నిర్మాతల్లో మొదలైంది. చిన్న నిర్మాతలు ఎలాంటి కంటెంట్ ఎంపిక చేసుకోవాలి? అనే విషయంలో మడాక్ తాజా నిర్ణయం ఆలోచింపజేసింది. పాన్ ఇండియా ట్రెండ్ లో ఎలాంటి కంటెంట్ అయితే జనాల్ని థియేటర్లకు లాక్కు రాగలదో తెలుసుకోవాలనే ఉత్సుకతను కూడా ఈ ఒక్క నిర్ణయం పెంచింది.