ఓవైపు ఇండియా- పాక్ వార్ భీకరంగా మారింది. మునుముందు ఇది మరో స్థాయికి చేరుకుంటుందని అందరూ భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో అకస్మాత్తుగా సల్మాన్ ఖాన్ సరిహద్దు వార్ డ్రామా కోసం ప్లాన్ చేస్తున్నాడని కథనాలొస్తున్నాయి. మురుగదాస్ తో సినిమా డిజాస్టర్ ఫలితం అందుకున్న వెంటనే సల్మాన్ తన ఆలోచనలను మార్చుకున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో కాకుండా, ఏదైనా సముచితమైన కథను, స్క్రిప్టును ఎంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు.
ఈసారి తెలివిగా దేశభక్తి నేపథ్యంలో సరిహద్దు వార్ డ్రామాను ఎంచుకున్నాడు. 2020 గల్వాన్ వ్యాలీ ఘర్షణ ఆధారంగా ఒక వార్ డ్రామాకు అతడు సంతకం చేయడానికి రెడీ అయ్యాడని తెలిసింది. గల్వాన్ వ్యాలీ ఘర్షణ ఇటీవలి భారత చరిత్రలో అత్యంత సున్నితమైన, చర్చనీయాంశమైన సైనిక సంఘర్షణలలో ఒకటి. షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా దర్శకుడు అపూర్వ లఖియా దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్, వాస్తవ సంఘటనల ఆధారంగా దేశభక్తి నేపథ్యంలో రూపొందనుంది. ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. మరో ఐదు నెలల్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ చిత్రీకరణ లడఖ్‌లో చిత్రీకరిస్తారని తెలుస్తోంది.
జూన్ 2020లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి భారత - చైనా సైనికుల మధ్య జరిగిన క్రూరమైన బాహాబాహీ (హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్) ని డ్రమటిగ్గా చూపించే ప్రయత్నమిదని తెలుస్తోంది. సల్మాన్ అకస్మాత్తుగా వార్ డ్రామా కథాంశాన్ని ఎంచుకోవడం నిజంగా అభిమానులను ఎగ్జయిట్ చేస్తోంది. నిజానికి సల్మాన్ భజరంగి భాయిజాన్ 2లో నటిస్తాడని వార్తలు వచ్చినా కానీ, దానికి సంబంధించిన అధికారిక ప్రకటన లేదు. ఇప్పుడు సరిహద్దు వార్ నేపథ్యంలోని సినిమాలో నటిస్తున్నాడు.