టికెట్ ధరలకు బెంబేలెత్తడం వల్లనే జనాలు థియేటర్లకు రావడం లేదని కింగ్ ఖాన్ షారూఖ్ పరోక్షంగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చడం చర్చనీయాంశమైంది. ఈ పరిస్థితిని మార్చేందుకు కొత్త థియేటర్ల వ్యవస్థ పుట్టుకు రావాల్సిన అవసరం ఉందని కింగ్ ఖాన్ వ్యాఖ్యానించారు. చిన్న పట్టణాల్లో పేద మధ్యతరగతి ప్రజలు థియేటర్లకు వచ్చేలా వ్యూహం మార్చాలని, టికెట్ ధరలు తగ్గాల్సి ఉందని ఖాన్ వ్యాఖ్యానించారు. తక్కువ మెయింటెనెన్స్, అందుబాటులో ఉండే ధరల కారణంగా ప్రజలు సినిమాలకు వస్తారని ఖాన్ అభిప్రాయపడ్డారు. వేవ్స్ సమ్మిట్- 2025 వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
నిజానికి అమీర్ ఖాన్ లాంటి ప్రముఖుడు ప్రజలు థియేటర్లకు ఎందుకు రావడం లేదు? అని బాధపడ్డారు కానీ, షారూఖ్ ఖాన్‌లా దీనికి ఒక సొల్యూషన్ ఇవ్వలేదు. ఒక రకంగా అమీర్ తో పోలిస్తే షారూఖ్ వ్యాపార దక్షతను కూడా ఇది బయటపెట్టింది. దశాబ్ధాలుగా రెడ్ చిల్లీస్ సంస్థ వ్యాపారాలు సహా ఐపీఎల్ పెట్టుబడులతో భారీగా లాభాలార్జిస్తున్న షారూఖ్, చిన్న పట్టణాల్లో నవ్యపంథా థియేటర్ల వ్యవస్థకు రూపకల్పన చేస్తూ.. తక్కువ టికెట్ ధరలతో సినిమాను సామాన్య మధ్య తరగతి ప్రజలకు చేరువ చేయాలని, దానికి మార్గదర్శకత్వం వహించాలని ప్రజలు ఆశిస్తున్నారు. నిజానికి థియేటర్లలోకి పెద్ద స్టార్ల సినిమాలు వచ్చినప్పుడే సందడి కనిపిస్తోంది. టూటైర్ హీరోలు నటించే సినిమాల కోసం ప్రజలు థియేటర్లకు రావడం లేదు. పెద్ద హీరోల సినిమాలకు ధీటుగా చిన్న హీరోలు నటించిన సినిమాలకు రూ. 300 నుంచి రూ. 500 మధ్య టికెట్ ధరల్ని వసూలు చేయడం కూడా జనం థియేటర్లకు రాకపోవడానికి ఒక కారణం. అలా కాకుండా చిన్న పట్టణాల్లో 100 లోపే టికెట్ ధరతో మినీ థియేటర్లలో సినిమాలను ఆడించే కల్చర్ తోనే జనం ఎక్కువగా సినిమాలు చూస్తారనేది షారూఖ్ విశ్లేషణ.
ఓటీటీ, డిజిటల్ లో సినిమాల వీక్షణకు ప్రజలు అలవాటుపోయిన ఈ యుగంలో జనాల్ని థియేటర్లకు రప్పించడం అంత సులువేమీ కాదని ఆయన విశ్లేషించారు. మారుతున్న కాలంతో పాటే ఆలోచన, బిజినెస్ ప్లాన్ మారాలి. ఇప్పటి పరిస్థితుల్ని మార్చేందుకు కింగ్ ఖాన్ షారూఖ్, మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్, మోహన్ లాల్ వంటి సినీరంగ ప్రముఖులు సంయుక్తంగా నడుం కట్టాల్సి ఉంది. కానీ మొదటి వారంలోనే ఇష్టానుసారం టికెట్ ధరల్ని పెంచుకుని దండుకునేందుకు అలవాటు పడిన నయా ఎగ్జిబిషన్ రంగం- పంపిణీ రంగం షారూఖ్ ఐడియాకు ఓకే చెబుతుందా? అన్నది పెద్ద సందేహమే.