సీన్ : సినీజోష్ రివ్యూ
Scene Movie Reviewసీన్ మూవీ రివ్యూ
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో.. మలయాళ ట్రెండింగ్ డైరెక్టర్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా క్రైమ్ థ్రిల్లర్ `సీన్`. నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించగా.. యంగ్ యాక్టర్ నస్లేన్ కీలక పాత్రలో కనిపించిన సినిమా దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విభిన్న కథాంశాలతో ప్రయోగాలు చేసే సూర్య ఈసారి మాలీవుడ్ కంటెంట్‌కి పక్కా కమర్షియల్.. మాస్ టచ్ ఇచ్చి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
సీన్ మూవీ కథ:
డీఎస్పీ ప్రేమ్ రాజ్ (సూర్య) పవర్ఫుల్ .. కాస్త భిన్నమైన యాటిట్యూడ్ ఉన్న పోలీస్ ఆఫీసర్. ఐదారేళ్ల క్రితమే సీరియల్ కిల్లర్ విక్టర్ కేసుని క్లోజ్ చేసిన ప్రేమ్ ఆ తర్వాత కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటాడు. పై అధికారి స్టీఫెన్ (లాల్) ఎంత వారించినా తన పద్ధతి మార్చుకోడు. అలాంటి సమయంలో సిటీలో అచ్చం అదే ప్యాట్రన్‌లో వరుస హత్యలు జరుగుతుంటాయి. కాపీ క్యాట్ కిల్లర్ ఈశ్వరన్ (నస్లేన్) చేసే హత్యలను చేధించేందుకు ప్రేమ్ రాజ్ రంగంలోకి దిగుతాడు. అసలు ఈశ్వరన్ ఎవరు? ప్రేమ్ రాజ్ వింత ప్రవర్తన వెనుక అసలు కారణం ఏంటి? చివరికి ఆ కాపీ క్యాట్ కిల్లర్‌ను హీరో ఎలా పట్టుకున్నాడు? అనేదే చిత్ర కథ.
సీన్ మూవీ నటీనటులు అభినయం:
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరోసారి నటనతో అదరగొట్టేశారు. ఈ చిత్రంలో ఆయన పోషించిన డీఎస్పీ ప్రేమ్ రాజ్ పాత్ర కేవలం సామాజిక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్లా కాకుండా కాస్త వైవిధ్యమైన బాడీ లాంగ్వేజ్.. గ్రే షేడ్స్‌తో సాగుతుంది. సీరియస్ ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలలో సూర్య ఇంటెన్సిటీ.. డార్క్ కామెడీ సీన్స్‌లో పండించిన హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ సూర్య పాత్రల్లో ప్రయోగాలు చేస్తూ ఏ పాత్రనైనా సులభంగా రక్తికట్టించగలనని ఈ సినిమాతో మరోసారి నిరూపించారు. మలయాళ చిత్రసీమలో యువ సంచలనంగా దూసుకుపోతున్న నస్లేన్ ఈ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. విలనిజం ఛాయలున్న `ఈశ్వరన్` పాత్రలో ఆయన నటన ఫ్రెష్‌గా అనిపిస్తుంది. సాధారణ యువకుడిలా కనిపిస్తూనే లోపల ఉన్న క్రూరత్వాన్ని.. సైకోలాజికల్ షేడ్స్‌ను కళ్లతో పండించిన తీరు అద్భుతం. ముఖ్యంగా సూర్య వంటి అగ్ర హీరో ఎదుట ఏమాత్రం తడబడకుండా ఆయనతో పోటాపోటీగా మైండ్ గేమ్‌లు ఆడే సన్నివేశాలలో నస్లేన్ తన పరిపక్వతను చాటుకున్నారు. చాలా కాలం తర్వాత వెండితెరకు రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా సహజమైన నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. సినిమాలో ఆమె పాత్ర పరిధి తక్కువగా ఉన్నా? స్క్రీన్‌పై కనిపించినంత సేపు క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నవ్వులు పూయించారు. ముఖ్యంగా హీరో సూర్యతో వచ్చే సీన్లలో కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. సీరియస్ క్రైమ్ థ్రిల్లర్‌లా సాగే కథలో నజ్రియా పాత్ర కథకు కాస్త రిలీఫ్‌ను ఇస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో పై అధికారిక పాత్రలో నటించిన సీనియర్ నటుడు లాల్ అనుభవాన్ని పూర్తిగా రంగరించి నటించారు. హీరోను కంట్రోల్ చేసే బాధ్యత గల అధికారిక పాత్రలో అభినయం ఆకట్టుకుంటుంది.
సీన్ మూవీ టెక్నికల్ - డైరెక్షన్:
`ఆవేశం` వంటి చిత్రాలతో ట్రెండ్ సృష్టించిన జిత్తు మాధవన్ ఈసారి క్రైమ్ డ్రామాకు డార్క్ కామెడీని జోడించి సరికొత్త ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా ఇన్వెస్టిగేషన్ తో పాటు సరదా కామెడీ సన్నివేశాలతో సాగుతుంది. సెకండాఫ్ మరింత వేగంగా పరుగులు పెడుతుంది. చిన్న చిన్న క్లూస్‌ను హీరో డీకోడ్ చేసే విధానం ఆసక్తికరంగా ఉంది. అయితే అక్కడక్కడి కొన్ని లాజికల్ లోపాలు మినహాయిస్తే దర్శకుడి టేకింగ్ స్టైలిష్‌గా ఉంది. సుశీన్ శ్యామ్ అందించిన నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమాను మరో లెవల్‌కి తీసుకెళ్లాయి. సూర్య-జ్యోతిక నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
సీన్ మూవీ ప్లస్ పాయింట్స్:
సూర్య ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ & స్టైల్
నస్లేన్, నజ్రియా నటన
సీన్ మూవీ మైనస్ పాయింట్స్:
రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కావడంతో కొన్ని ఊహించదగిన ట్విస్టులు
సెకండాఫ్‌లో కొన్ని చోట్ల నెమ్మదించిన కథనం
సీన్ మూవీ తీర్పు:
`సీన్` సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు. క్రైమ్‌కు డార్క్ కామెడీని మిక్స్ చేసి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా మలిచారు. సూర్య ఫ్యాన్స్‌తో పాటు థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఈ చిత్రం నిరాశపరచదు.
సీన్ మూవీ రేటింగ్: 2.25/5
















































