Advertisement

సినీజోష్‌ రివ్యూ: గీత గోవిందం

Thu 16th Aug 2018 11:42 AM
telugu movie geetha govindam,geetha govindam movie review,geetha govindam review in cinejosh,geetha govindam cinejosh review,vijay devarakonda in geetha govindam  సినీజోష్‌ రివ్యూ: గీత గోవిందం
geetha govindam movie review సినీజోష్‌ రివ్యూ: గీత గోవిందం
సినీజోష్‌ రివ్యూ: గీత గోవిందం Rating: 3 / 5
Advertisement

జిఎ2 పిక్చర్స్‌ 

గీత గోవిందం 

తారాగణం: విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా, నాగబాబు, వెన్నెల కిశోర్‌, సుబ్బరాజు, రాహుల్‌ రామకృష్ణ, మౌర్యాని, అన్నపూర్ణ తదితరులు 

సినిమాటోగ్రఫీ: మణికందన్‌ 

ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌ 

సంగీతం: గోపీసుందర్‌ 

సమర్పణ: అల్లు అరవింద్‌ 

నిర్మాత: బన్ని వాసు 

రచన, దర్శకత్వం: పరశురామ్‌ 

విడుదల తేదీ: 15.08.2018 

ఒక సినిమా సక్సెస్‌ అవ్వాలంటే కథ ముఖ్యం అంటారు. అలాగే కథనం బాగుండాలి అంటారు. కానీ, ఎప్పటికప్పుడు కొత్త కథలు ఎలా పుట్టుకొస్తాయి? మనకు తెలిసిన కథలు కొన్నే. వాటినే అటూ ఇటూ మార్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా చెప్పగలగాలి. అలా చెప్పగలిగిన దర్శకులు కొందరే ఉంటారు. పాత కథే అయినా సినిమా బాగుంది అని అందరిచేతా అనిపిస్తారు. అలాంటి దర్శకుల్లో పరశురామ్‌ ఒకరు అని బుధవారం విడుదలైన గీత గోవిందం సినిమా చూసి చెప్పొచ్చు. అర్జున్‌రెడ్డి వంటి పెద్ద హిట్‌ తర్వాత విజయ్‌ దేవరకొండతో ఆ సినిమాకి పూర్తి విభిన్నమైన సినిమా చెయ్యాలంటే చాలా గట్స్‌ కావాలి. అవి తనకు ఉన్నాయని పరశురామ్‌ నిరూపించుకున్నాడు. అర్జున్‌రెడ్డి తర్వాత విజయ్‌ దేవరకొండ ఒక భిన్నమైన ఇమేజ్‌ని సంపాదించుకొని యూత్‌కి బాగా దగ్గరయ్యాడు. ఆ ఇమేజ్‌ నుంచి బయటికి తీసుకొచ్చి ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గర చెయ్యాలన్న పరశురామ్‌ ప్రయత్నం ఎంతవరకు ఫలించింది? అర్జున్‌రెడ్డికి పూర్తి కాంట్రాస్ట్‌ క్యారెక్టర్‌కి విజయ్‌ దేవరకొండ ఎంతవరకు న్యాయం చెయ్యగలిగాడు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

అతని పేరు విజయ్‌ గోవిందం(విజయ్‌ దేవరకొండ). లెక్చరర్‌గా పనిచేసే విజయ్‌కి ఆడవాళ్ళన్నా, మన సంప్రదాయాలన్నా ఎంతో గౌరవం. చాగంటి ప్రవచనాల్లో చెప్పే వాటిని తు.చ. తప్పకుండా పాటించాలని కోరుకునే వ్యక్తి. తనకు కాబోయే భార్య ఎలా ఉండాలన్న విషయంలో మంచి అభిరుచి కలిగిన విజయ్‌కి ఎవరు ప్రపోజ్‌ చేసినా నో అని చెప్తుంటాడు. ఓరోజు గుడిలో గీత(రష్మిక మందన్నా)ని చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. తన చెల్లెలి పెళ్లి కోసం కాకినాడ వెళ్తున్న విజయ్‌కి అనుకోకుండా బస్‌లో తన పక్క సీటుకే వస్తుంది గీత. ఆ ప్రయాణంలో యాక్సిడెంటల్‌గా జరిగిన ఓ సంఘటన వల్ల గీత దృష్టిలో చెడ్డవాడిగా మారతాడు విజయ్‌. తన చెల్లెలు పెళ్ళి చేసుకోబోయే వ్యక్తి గీత అన్నయ్య అని తెలుసుకొని షాక్‌ అవుతాడు విజయ్‌. ఆ తర్వాత విజయ్‌, గీత కలిసి పెళ్ళికి సంబంధించిన పనులు చెయ్యాల్సి వస్తుంది. బస్‌లో జరిగిన ఘటనతో గీత దృష్టిలో చెడ్డవాడిగా ముద్ర వేయించుకున్న విజయ్‌ పరిస్థితుల ప్రభావం వల్ల తన మంచితనాన్ని నిరూపించుకోలేకపోతాడు. కానీ, విజయ్‌ గురించి కొన్ని నిజాలు తెలుసుకున్న గీత రియలైజ్‌ అవుతుంది. ఆ తర్వాత కథ ఎన్ని మలుపులు తిరిగింది? వారిద్దరి ప్రేమ పెళ్ళి వరకు వెళ్ళిందా? అనేది మిగతా కథ. 

అర్జున్‌రెడ్డి సినిమాలో డ్రగ్‌ ఎడిక్ట్‌గా, తాగుబోతుగా, భగ్నప్రేమికుడిగా డిఫరెంట్‌ షేడ్స్‌ని అద్భుతంగా పండించిన విజయ్‌ దేవరకొండ.. ఈ సినిమాలో ఒక అమాయకుడిగా, మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించేవాడిగా పూర్తి భిన్నమైన పాత్రను అంతే అద్భుతంగా చేశాడు. హీరోయిన్‌తో చేసిన చాలా సీన్స్‌లో అతని నటన ఎంటర్‌టైన్‌ చేస్తుంది. చనిపోయిన తల్లిని భార్యలో చూసుకోవాలనుకునే కొడుకుగా అతని పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. గీత పాత్రను పోషించిన రష్మిక మందన్న చక్కని అందంతోపాటు అభినయాన్ని కూడా ప్రదర్శించింది. తన పాత్ర పరిధి మేరకు తన నటనతో ఆకట్టుకుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఓ సీన్‌లో ఆమె నటన కంటతడి పెట్టిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే విజయ్‌ దేవరకొండ, రష్మిక పోటీపడి నటించారు. ఈ విషయంలో ఎవరినీ తక్కువ చేయడానికి లేదు. విజయ్‌ ఫ్రెండ్‌గా రాహుల్‌ రామకృష్ణ కామెడీని అందించే ప్రయత్నం చేశాడు. సెకండాఫ్‌లో వచ్చే వెన్నెల కిశోర్‌ పాత్ర చివరి వరకు ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. విజయ్‌ తండ్రిగా నటించిన నాగబాబుకి వేరొకరు చెప్పిన డబ్బింగ్‌ సూట్‌ అవ్వలేదు. విజయ్‌ చెల్లెలుగా మౌర్యానీ, గీత అన్నయ్యగా సుబ్బరాజు వారి పాత్రలకు న్యాయం చేశారు. ఈ చిత్రంలో నిత్యా మీనన్‌, అను ఇమ్మానుయేల్‌ అతిథి పాత్రలు పోషించారు. అనూ ఒకే ఒక సీన్‌లో కనిపిస్తుంది. నిత్యాను అనుకోకుండా కలిసిన విజయ్‌ తన ప్రేమకథను ఆమెకు చెప్తుంటాడు. అలా నిత్యా అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. 

సాంకేతిక విభాగాల గురించి చెప్పుకోవాలంటే మణికందన్‌ ఫోటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్‌ని ఎంతో నేచురల్‌ లైటింగ్స్‌తో అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. గోపిసుందర్‌ చేసిన పాటల్లో రెండు పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. రెగ్యులర్‌ సినిమాల్లో వచ్చే డ్యూయెట్లు ఈ సినిమాలో లేవు. సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా ఉన్న పాటలు కథకు, కథనానికి అంతరాయం కలిగించలేదు. గోపీసుందర్‌ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా బాగుంది. మార్తాండ్‌ కె. వెంకటేష్‌ ఎడిటింగ్‌ బాగున్నా... ఫస్ట్‌హాఫ్‌లోని బస్‌ సీన్‌, సెకండాఫ్‌లో విజయ్‌, గీత కలిసి తిరిగే కొన్ని సన్నివేశాలు ఎక్కువయ్యాయన్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఓ సందర్భంలో కూడా బోర్‌ కొడుతుంది కూడా. జి.ఎ.2 పిక్చర్స్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ కథకు తగ్గటుగా బాగానే ఉన్నాయి. ఇక దర్శకుడు పరశురామ్‌ గురించి చెప్పాలంటే.. సినిమా బాగుంది అనే టాక్‌ వచ్చినా, హీరో, హీరోయిన్‌ పెర్‌ఫార్మెన్స్‌ బాగుందని అందరూ చెప్పుకున్నా ఆ క్రెడిట్‌ అంతా అతనికే చెందుతుంది. కథలో కొత్తదనం ఏ కోశానా కనిపించదు. కానీ, కథనం, ప్రధాన పాత్రల తీరు తెన్నులు కొత్తగా అనిపిస్తాయి. కథను నడిపించే కొన్ని సన్నివేశాలు కొత్తగా అనిపిస్తాయి. నెక్స్‌ట్‌ సీన్‌లో ఏం జరగబోతోందే ముందే ఊహించగలిగేలా ఈ కథ ఉంటుంది. అయినప్పటికీ ప్రేక్షకుల్ని సీట్లలో కూర్చోబెట్టగలిగాడంటే అది దర్శకుడి గొప్పతనమే. అలాగే పరశురామ్ రాసిన డైలాగ్స్ కూడా బాగున్నాయి. అర్జున్‌రెడ్డి క్యారెక్టర్‌ నుంచి బయటికి తీసుకొచ్చి విజయ్‌ని ఓ కొత్త క్యారెక్టర్‌ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గర చెయ్యడంలో పరశురామ్‌ సక్సెస్‌ అయ్యాడు. కథను నడిపిస్తూనే మధ్య మధ్యలో కథలో భాగంగానే నవ్వులు కూడా పూయించడంలో కూడా దర్శకుడు తన తెలివిని ప్రదర్శించాడు. అయితే ప్రారంభం నుంచి స్లో నేరేషన్‌తో సినిమా వెళ్తుండడం వల్ల నిడివి ఎక్కువ అనే ఫీలింగ్‌ కలుగుతుంది. అర్జున్‌రెడ్డి ఫ్లేవర్‌ ఈ సినిమాలో కూడా ఎంతో కొంత కనిపించాలన్నట్టుగా కథకు అంతగా అవసరం లేకపోయినా మందు సీన్స్‌ చాలానే ఉన్నాయి. అసలు సినిమాలో విజయ్‌ చెప్పే మొదటి డైలాగ్‌ మందు ఉందా? అని. ఈ సినిమాలో కూడా అదే తంతు కొనసాగుతుందా? అని ప్రేక్షకులు అనుకునేలోపే అసలు కథలోకి వెళ్లిపోవడంతో ఓ కొత్త విజయ్‌ని చూస్తాం. ఫైనల్‌గా చెప్పాలంటే అర్జున్‌రెడ్డితో యూత్‌ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకున్న విజయ్‌ దేవరకొండ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా సంపాదించుకుంటాడు. కథ పాతదే అయినా, సినిమాలో కొన్ని లాజిక్కులు మిస్‌ అయినా, అక్కడక్కడా బోర్‌ కొట్టించే సన్నివేశాలు ఉన్నప్పటికీ ఓవరాల్‌గా గీత గోవిందం అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే చెప్పాలి. 

ఫినిషింగ్‌ టచ్‌: పాత కథతో కొత్త మ్యాజిక్ 

geetha govindam movie review:

vijay devarakonda new movie geetha govindam

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement