Home >> Gossips >> Juhi Chawla’s net worth rises from Rs 4,600 crore to Rs 7,790 crore

రూ.7790 కోట్ల ఆస్తుల‌తో నం.1 హీరోయిన్

By Rambabu Updated at: 2026-09-25 05:39:53 AM IST
రూ.7790 కోట్ల ఆస్తుల‌తో నం.1 హీరోయిన్

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి జూహీ చావ్లా వ్యాపార రంగంలోనూ అద్భుతమైన విజయాలను సాధిస్తూ చరిత్ర సృష్టించారు. తాజాగా విడుదలైన M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ రిపోర్ట్ ప్రకారం..జూహీ నికర ఆస్తుల విలువ ఏకంగా రూ. 7,790 కోట్లకు చేరింది. దీనితో భారతదేశంలోనే అత్యంత సంపన్నురాలైన నటిగా జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.

కేవలం నటనకే పరిమితం కాకుండా.. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంలో ఈ సీనియ‌ర్ న‌టి చూపిన ప్రతిభ ఈ ఘనతకు ప్రధాన కారణం. దేశంలోని అత్యంత సంపన్నులైన సెల్ఫ్-మేడ్ మహిళల జాబితాలో జూహీ చావ్లా ఆరవ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. భర్త జయ్ మెహతాతో కలిసి ఉన్న వ్యాపారాలు.. షారుఖ్ ఖాన్‌తో కలిసి భాగస్వామ్యం వహిస్తున్న `కోల్‌కతా నైట్ రైడర్స్` (KKR) ఐపీఎల్ ఫ్రాంచైజీ, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి వెంచర్లు జూహీ చావ్లా సంపద భారీగా పెరగడానికి దోహదపడ్డాయి.

వెండితెరపై ఒక వెలుగు వెలిగిన జూహీ చావ్లా.. వ్యాపార రంగంలోనూ ఒక పారిశ్రామికవేత్తగా దూసుకుపోతుండటంపై అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. ఒకప్పుడు బాలీవుడ్‌, టాలీవుడ్‌లో స్టార్‌గా వెలిగిన జూహీ ఇప్పుడు సినిమాల కంటే బిజినెస్‌తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.

M3M హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం ఆమె సంపద ఏకంగా రూ.7,790 కోట్లు. జూహీ ప్ర‌స్తుతం సెల్ఫ్ మేడ్ మ‌హిళ‌ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నారు. భ‌ర్త జే మెహ‌తాతో క‌లిసి వ్యాపారాల ద్వారా ఆర్జిస్తున్న జూహీ త‌న స్నేహితుడు షారూఖ్ ఖాన్ తో క‌లిసి రెడ్ చిల్లీస్ వ్యాపారాల‌లోను పెట్టుబ‌డులు పెట్టారు. కేకేఆర్ టీమ్ స‌హ‌భాగ‌స్వామిగాను ఉన్నారు. 12,490 కోట్ల ఆస్తుల‌తో హురూన్ జాబితాలో షారూఖ్ ఖాన్ అత్యంత సంప‌న్న న‌టుల‌లో నంబ‌ర్ వ‌న్ గా నిలిచారు.

Juhi Chawla