PR పంచ్ లో జర్నలిస్ట్ ప్రభు గారు తమ్ముడు చిత్రం పై మరియు దిల్ రాజు గారికి సినిమా పరిశ్రమ నుండి ఇప్పుడు వస్తున్నా సినిమాలపై సుమన్ టీవీ లో వచ్చిన చక్కటి విశ్లేషణ ప్రభు గారి అనుమతితో యధాతధంగా మన సినీజోష్ వీవర్స్ కోసం.
హలో నమస్తే..
మొన్న జూలై 4 న విడుదలైన తమ్ముడు సినిమా చూసిన తరువాత రివ్యూలు, రేటింగ్ లు అంటూ ఆ సినిమాను చీల్చి చెండాడే ఉద్దేశం మాకు లేదు. అయితే సినిమా రిలీజ్ అయిన రోజునే రివ్యూలు పెట్టి సినిమాలను కిల్ చేస్తున్నారని ఇండస్ట్రీ మొత్తం వాపోతున్న కారణంగా రిలీజ్ అయిన కొన్ని రోజుల తరువాత ఈ సినిమాకు సంబంధించిన సమీక్షను మీ ముందుకు తెస్తున్నాను. నిజానికి ఇది రివ్యూ కాదు.. కానీ ఈ సినిమా చూసిన తరువాత ఎవరికైనా కొన్ని సందేహాలు, ప్రశ్నలు పుట్టుకొస్తాయి. ఎందుకంటే ఇలాంటి సినిమా ఎవరో ఎన్నారైలు లేక రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించి కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన రియల్టర్లు తీసారంటే అనుభవ రాహిత్యం అనుకోవచ్చు. కానీ నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన రంగాలలో 30 ఏళ్ల అనుభవంతో దాదాపు 60 కి పైగా చిత్రాలు నిర్మించిన దిల్ రాజు నుండి ఇలాంటి సినిమా రావటం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా అన్న తర్వాత అపజయాలకు ఎవరు అతీతులు కారు.
నిజానికి చిత్ర నిర్మాణంలో కాకలు తీరిన యోధానయోధు లాంటి నిర్మాతలు, దర్శకులు అట్టర్ ప్లాపులతోనే విరమించుకున్నారు తప్ప విజయాలతో కెరీర్ ముగించిన వారు చరిత్రలో దాదాపు లేరనే చెప్పాలి. కాబట్టి ఫెయిల్యూర్ ఇవ్వటం తప్పు కాదు.. నేరము కాదు. అలాగే దిల్ రాజు లాంటి ఒక ప్రామిసింగ్ అండ్ రన్నింగ్ ప్రొడ్యూసర్ జడ్జిమెంట్ మీద నమ్మకాన్ని, గౌరవాన్ని ఏర్పరుచుకోవడం ప్రేక్షకుల తప్పు కూడా కాదు. ఒక క్యాలెండర్ ఇయర్ లో ఆరు చిత్రాలు రిలీజ్ చేసి ఆరు హిట్స్ తో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన అరుదైన వరల్డ్ రికార్డ్ కలిగిన గ్రేట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. అంతమాత్రాన ఆయన నుండి ప్లాప్స్ రాకూడదని, ప్లాప్ ఇవ్వటం నేరమని ఎవరు అనరు. అయితే చిత్ర నిర్మాణం పట్ల ఒక నిర్మాణాత్మకమైన అవగాహన, అనుభవం కలిగిన దిల్ రాజుకు వరుసగా ఫ్యామిలీ స్టార్, గేమ్ చేంజర్, ఇప్పుడు తాజాగా తమ్ముడు లాంటి ఎదురు దెబ్బలు తగలటం బాధగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే గతాన్ని పక్కన పెడితే ఇప్పుడు తాజాగా విడుదలైన తమ్ముడు చిత్రం చూసాక ఎవరికైనా ఎదురయ్యే మొదటి డౌట్ అసలు ఈ చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్ ఏం చెప్పి, ఏం చేసి దిల్ రాజును ఒప్పించాడు అన్నది Thousand Dollors క్వశ్చన్. అందుకే అక్కా తమ్ముళ్ల ఈ రొటీన్ సెంటిమెంటల్ డ్రామాలో నాకు వచ్చిన కొన్ని సందేహాలను మీ ముందు ఉంచుతున్నాను.
ఒకటి ఈ తమ్ముడు కథకు మూలం అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్. అక్కకు తమ్ముడికి పదేళ్ల గ్యాప్ ఉంటుంది. అక్క పెళ్లి చేసుకుని వెళ్లే నాటికి తమ్ముడు దాదాపు 12 ఏళ్ల వాడు. అంటే ఎంత గ్యాప్ వచ్చినా అక్కను తమ్ముడు గుర్తుపట్టగలడు తమ్మున్ని అక్క కూడా గుర్తుపట్టవచ్చు. కానీ ఇందులో ఆ పాయింట్ రైజ్ కాకుండా ఐడెంటిటీ మిస్సింగ్ తో డ్రామాను నడిపించాలను కోవటం ఏమిటో అర్థం కాదు.అక్క తన లవర్ కు ఇమ్మని ఇచ్చిన లవ్ లెటర్ తమ్ముడి దగ్గర నుండి తండ్రిలాగేసుకుంటే అందులో వాడి తప్పేముంది..? తనకు ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసిన తండ్రి మీద కోపం ఉండవచ్చు కానీ కన్నకొడుకు లాగా చూసుకున్న తమ్ముడిని వదిలేయటానికి బలమైన కారణం ఏమీ లేదుగా.. అయినా గొప్ప సంస్కారి అయిన భర్త దొరికాడు కాబట్టి తమ్ముణ్ణి చేరదీసుకుంటుంది గాని అతన్ని శాశ్వతంగా వదిలేసుకోవాల్సిన అవసరం ఏముంది..? పోనీ నువ్వు ప్రేమించిన వాడితో లేచిపోయి ఉంటే అప్పుడు సమాజంలో లేచిపోయిన దాని తమ్ముడు అనే అపప్రద తమ్ముడికి ఎక్కడ వస్తుందో అనే భయంతో తన ఐడెంటిటీని హైడ్ చేసుకుంది అంటే ఒక అర్థం ఉంటుంది.
అలా కాకుండా కేవలం తండ్రి మీద కోపంతో అల్లారు ముద్దుగా చూసుకున్న తమ్ముడు చచ్చాడో బతికాడో కూడా తెలియకుండా 15 ఏళ్ల పాటు ఏ అక్కా ఉండదు. తనను కన్న తల్లిలాగా చూసుకున్న అక్క తనకు శాశ్వతంగా దూరమైతే ఏ తమ్ముడు తట్టుకోలేడు. అలాంటి అక్క ఎక్కడ.. ఎలా ఉందో.. పట్టకుండా తమ్ముడు ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్ అవుతాడు. కానీ ఆ విలువిద్యలో eye ball ను కొట్టలేక పోవటానికి మాత్రం సబ్ కాన్షస్ మెమరీలో అక్క జ్ఞాపకాలు వెంటాడటమే కారణం అని గ్రహించి 15 ఏళ్ల తరువాత అక్క కోసం అన్వేషణ ప్రారంభిస్తాడు. ఇది ఈ కథకు బేస్.అసలు అక్కా తమ్ముళ్లు విడిపోయిన కారణమే బలంగా లేదు కదా.. ఈ సిల్లీ రీజనింగ్ తో అక్కాతమ్ముళ్ల సెంటిమెంటును ఎలా పండిస్తావు.. అని దిల్ రాజు దర్శకుడు వేణు శ్రీరామ్ ను అడిగి ఉంటే అసలు ఈ సినిమా అక్కడే ఆగిపోయి ఉండేది.
ఇక విలన్ ట్రాక్ విషయానికి వస్తే సౌండ్ ఎలర్జీ అనే ఒక విచిత్రమైన డిఫెక్ట్ తో విలన్ ట్రాక్ ను డిజైన్ చేశాడు దర్శకుడు వేణు శ్రీరామ్. అదెంత అబ్సర్డ్ గా ఉందో చూద్దాం.. బాగా డబ్బున్న పిల్లలు లేని జంట ఒక 15 ఏళ్ల అనాధ బాలుడిని పెంచుకుంటుంటే వాడు తెలివిగా వాళ్ల కారుకు యాక్సిడెంట్ చేసి వాళ్ళను చంపేసి తను మాత్రం ప్రాణాలతో బయటపడతాడు. అయితే ఆ యాక్సిడెంట్ కారణంగా ఒళ్ళు మొత్తం కాలిపోయి వికృతంగా కనిపించటమే కాక కర్ణభేరి పగిలి సౌండ్ ఎలర్జీ అనే ప్రాబ్లం వస్తుంది.. ఆ పెంపుడు తల్లిదండ్రుల ఇన్సూరెన్స్ డబ్బులతో వాడు పెద్ద డాన్ గా ఎదుగుతాడు. 20 డేసిబిల్స్ సౌండ్ ను కూడా తట్టుకోలేని ఒక అనాధ బాలుడు పెద్ద డాన్ గా అవతరించి మంత్రులను, ముఖ్యమంత్రులను లను, అధికారులను, మీడియాను కూడా శాసించగల స్థాయికి ఎలా ఎదుగుతాడు..? అన్న చిన్న లాజిక్కు దిల్ రాజు అడిగినా ఆ సినిమా అక్కడే ఆగిపోయి ఉండేది. కనీసం ఆ ట్రాక్ అంత అతిశయోక్తిగా తయారై ఉండేది కాదు.
ఇక ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఫ్యాక్టరీని పేల్చేసి వందలాది కార్మికులను పొట్టన పెట్టుకుంటాడు విలన్. న్యాయపోరాటం చేస్తున్న కార్మికుల పక్షాన ఫైనల్ ఎంక్వయిరీ చేసి ఫైల్ మీద సంతకం చేయాల్సిన కర్తవ్య ధర్మానికి కట్టుబడ్డ అక్కను చంపటానికి బయలుదేరుతుంది విలన్ గ్యాంగ్. ఎక్కడో ఆంధ్ర, ఛత్తీస్గడ్ సరిహద్దుల్లోని గిరిజన గ్రామంలో కొండ దేవత మొక్కు తీర్చుకోవటానికి అక్క తన భర్త తరపు బంధు వర్గం మొత్తాన్ని తీసుకొని వెళ్తుంది. అదే సమయంలో అక్కను వెతుక్కుంటూ తమ్ముడు తన గర్ల్ ఫ్రెండ్ తో బయలుదేరుతాడు. ఆ అన్వేషణలో భాగంగా అనుకోకుండా అక్క కూతుర్ని రక్షిస్తాడు. అప్పుడు అక్కను తను గుర్తుపట్టాడు గాని విచిత్రంగా అక్క మాత్రం తమ్ముడిని అస్సలు పోల్చుకోదు. ఇక్కడ నుండి ప్రారంభమయ్యే ఐడెంటిటీ హైడ్ డ్రామా నుండి ఎంత పిసికినా, పిండినా, సాగదీసిన అక్కా తమ్ముడి సెంటిమెంట్ మాత్రం పండక పోగా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. ఇక ఇక్కడి నుండి ఆ గిరిజన నేపథ్యంలో కోటానుకోట్లు తగలేసి తీసిన ఆ ఫైట్స్ ను చేజింగ్ లను చూస్తే చిరాకు నషాళానికి అంటుతుంది.
రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వమూ వాళ్లను పట్టించుకోదు అన్నది నక్సలైట్ల సమస్య తీవ్రంగా ఉన్న ఎప్పుడో 40 ఏళ్ల కిందటి మాట. నిజానికి ఇలాంటి సరిహద్దు ప్రాంతాలలో రెండు రాష్ట్రాల గిరిజన సంక్షేమ పథకాలు వారికి అందుతుంటాయి. అలాగే ఓట్ల కోసం రెండు రాష్ట్రాల రాజకీయ నాయకులు వాళ్లని ముద్దు చేస్తుంటారు.. వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని దోపిడీ కూడా చేస్తుంటారు. అది పక్కన పెడితే ఆ కుటుంబాన్ని చంపేస్తే కోటి రూపాయలు ఇస్తామని విలన్ మనుషులు ప్రకటిస్తే ఐదు గూడేల నుండి వేలాది గిరిజనులు అంత రాత్రి పూట కాగడాలు పట్టుకుని ఆ కుటుంబాన్ని అంతం చేయడం కోసం వేటాడుతుంటారు. నిజానికి ఈ సినిమాలో ఇది ఎంత అసంబద్ధమైన సీక్వెన్సో చెప్పటానికి మాటలు చాలవు.
వాస్తవానికి ఉత్తరాంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గడ్ లకు చెందిన సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ గిరిజనుల భాష, యాస, జీవన విధానం చూస్తే ఆ అడవి బిడ్డలు అంత క్రూరమైన హత్యలు చేయడానికి అర్ధరాత్రి వేళ ఊర్లకు ఊర్లు తండోపతండాలుగా కాగడాలు పట్టుకొని తరలి వస్తారా? తెల్లవారేసరికి వాళ్లను చంపేయాలన్న విలన్ ఆదేశం అసలు కమ్యూనికేషనే లేని ఆ గిరిజన తండాల జనాలందరికీ ఎలా చేరుతుంది. పుట్టింది మొదలు పౌష్టికాహార లోపంతో బక్క చిక్కి బలహీనంగా కనిపించే ఆ అమాయక అడవి బిడ్డలు డబ్బు కోసం అంత క్రూరమైన హత్యలు చేయడానికి తెగబడతారనే సీక్వెన్స్ చాలా అసంబంధంగా అనిపించలేదా మీకు..? పోనీ ఆ గిరిజన తండాల్లో ఒక క్రూరమైన గ్యాంగ్ ఉంది దాని ద్వారా వీళ్ళను చంపించాలని చూశాడు అంటే కొంత అర్థం ఉంటుంది. అంతేగాని ఆ గిరిజన ప్రాంతాల వేష భాషలకు, నాగరికతకు సంబంధం లేకుండా ఒంగోలు పందెపు ఎద్దుల్లాగా, తెగ బలిసిన దున్నపోతు లాంటి వందలాది నరహంతకులు మీదకు ఎగబడుతుంటే నితిన్ ఒక్కడే ఒంటి చేత్తో వాళ్లను మట్టుబెట్టేస్తాడని దర్శకుడు చెబితే మాత్రం తలా తోకా లేని ఆ సీక్వెన్స్ కు దిల్ రాజు తల ఊపి కోట్లకు కోట్లు ఎలా గుమ్మరించారో అర్థం కాదు.
పోనీ అక్కడ ఉన్నది పవర్ఫుల్ మాస్ ఇమేజ్ కలిగిన చిరంజీవి, బాలకృష్ణ లాంటి metani idols కాదు. లవర్ బాయ్ ఇమేజ్ నుండి ఇంకా పూర్తిగా బయటపడని హ్యాండ్సం యంగ్ బోయ్ నితిన్. అయినా ఈ సినిమా ఒక్కటనే కాదులే.. ఒంటి చేత్తో వందలాదిమందిని సొరకాయలు, బీరకాయలు తురిమినంత ఈజీగా తురిమేసే దిక్కుమాలిన ఫైట్ సీక్వెన్స్ లను కన్సీవ్ చేస్తున్న డైరెక్టర్లు, వాటిని కంపోజ్ చేస్తున్న ఫైట్ మాస్టర్లు వాటిలో యాక్ట్ చేస్తున్న స్టార్స్ ను, వాటికి తల ఊపుతూ కోట్లు తగలేస్తున్న నిర్మాతలు అందరూ ఈ అసంబద్ధ అతిశయోక్తికి,ఈ నేల విడిచిన సాము గరిడీలకు బాధ్యులే. ఇంకా ఈ సినిమా నిండా ఎన్నెన్నో పండని సీన్లు.. వాటిని పండించటానికి దర్శకుడు పడిన పాట్లను చూస్తే ఇది దిల్ రాజు సినిమా కాదు.. ఆయన చేయి దాటిపోయి.. చేతులెత్తేసిన సినిమా అన్నది అర్థమవుతుంది.
నిజం చెప్పాలంటే ఈ తమ్ముడు సినిమా.. నిర్మాతగా దిల్ రాజు విజన్ మీద.. ఆయన జడ్జిమెంట్ మీద.. ఆయన కమిట్మెంట్ అండ్ కమాండ్ మీద ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకం సడలి పోతుందని చెప్పే ప్రమాద హెచ్చరిక లాంటిది. కాంబినేషన్ సెట్ అయింది కదా అని తలా తోక లేని తలతిక్క సినిమాలు పుఖాను పుంఖాలుగా వస్తున్న ఈరోజుల్లో హీరోలు, డైరెక్టర్ల ఇగో సాటిస్ఫాక్షన్ కోసం కోటానుకోట్లు గుమ్మరించి గుమ్మం ముందు చేతులు కట్టుకుని నిలబడే నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు కాదు.. కాకూడదు అన్న గౌరవాభిమానాలతో చెబుతున్నదే తప్ప సినిమా పట్ల ఆయన చిత్తశుద్ధిని, కమిట్మెంట్ ను శంకించి, కించపరిచే దుస్సాహసం కానే కాదు. అసలు ఇవన్నీ తమ్ముడు సినిమా ముఖతః చెప్తున్నప్పటికీ.. ఇప్పుడు వస్తున్న చాలా భారీ కాంబినేషన్లకు వర్తించే వాస్తవాలు ఇవి.
కాంబినేషన్ల వెంట పరుగులు పెడుతున్న నిర్మాతలను కొందరు హీరోలు, దర్శకులు పెడుతున్న చిత్రహింసల చరిత్రలన్నీ మాకు తెలుసు. నిజానికి కాంబినేషన్ల కమర్షియల్ వాల్యూని ఎవరు కాదనలేరు. అంతమాత్రాన నిర్మాతను నిమిత్తమాత్రుడిగా నిస్సహాయ స్థితిలో నిలబెట్టే నిరంకుశ సృజనాత్మకతను సహించకూడదు. అనుమతించకూడదు. ముఖ్యంగా కొందరు దర్శకులు కొన్ని గొప్ప హిట్స్ ఇస్తే ఇచ్చి ఉండవచ్చు. అయితే ఆపసోపాలు పడుతూ ఇచ్చిన ఆ విజయం కోసం ఆరు సినిమాల లెంగ్త్ ను ఎక్స్ పోజ్ చేసి అందులోనుండి మూడు సినిమాల ఫైనల్ కట్ ఇచ్చి ఆ పై ఎడిటింగ్ రూముల్లో వందలాది గంటలు కుస్తీలు పట్టి కోట్ల విలువైన ఎక్స్ పోజర్ ను డస్ట్ బిన్ పాలు చేస్తున్నారు. ప్రేక్షకుడికి చూపించే 13వేల అడుగుల సినిమా కోసం లక్షలాది అడుగులు ఎక్స్పోజ్ చేస్తూ కోటానుకోట్ల విలువైన కాల్ షీట్లను నిర్దాక్షిణ్యంగా తగలేస్తున్నారు.
అలాంటి అనారోగ్యకరమైన విజయం కన్నా కన్విక్షన్తో వచ్చే అపజయం మిన్న. కాబట్టి విజయం అనే లక్ష్యమే కాదు దాన్ని సాధించిన మార్గం కూడా మంచిదై ఉండాలి అన్న గాంధీజీ సూక్తిని చిత్ర నిర్మాణానికి అన్వయించుకోవలసిన అవసరం ఉంది. దిల్ రాజు లాంటి కమిట్మెంట్, కన్విక్షన్ కలిగిన నిర్మాత నుండి ఒకటీ అరా ఫెయిల్యూర్స్ రావచ్చు గానీ నిర్మాతగా ఆయన ఫెయిల్ అవ్వకూడదు. అద్భుత విజయాల సుదీర్ఘ చరిత్ర కలిగి ఆదర్శ, అగ్రశ్రేణి నిర్మాతగా ఎదిగిన దిల్ రాజు సినిమా కు థియేటర్లో ప్రేక్షకులు ఆనందంగా చరిచే చప్పట్లు, కేరింతలు వినిపించాలే కానీ తమ్ముడు చిత్రానికి వచ్చినట్లు కేకలు, అరుపులు, అవహేళన లాంటి ట్రోలింగ్ ను ఎవరూ expect చేయరు.
సో.. బొమ్మరిల్లు, పరుగు, శతమానం భవతి, బలగం వంటి ఎన్నెన్నో ఆహ్లాదకరమైన ఫీల్ గుడ్ చిత్రాలను అందించిన SVC బ్యానర్ ను అలా ఆ శిఖరాగ్రాలపైనే చూడాలి అనుకోవటం అత్యాశ కాదు.. చివరిగా ఒక మాట ఈ విశ్లేషణ మొత్తం కేవలం దిల్ రాజు గురించి మాత్రమే చెప్తున్నాను అనుకుంటే పొరపాటు. కమర్షియల్టీ పేరుతో అర్థంపర్థం లేని చెత్త సినిమాలు తీస్తున్న దర్శక నిర్మాతలు అందరికీ ఇది వర్తిస్తుంది. నిజానికి 80% సక్సెస్ రేట్ కలిగిన ప్రామిసింగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఆయన నుండి ఇలాంటి సినిమాలు రావడం బాధాకరం అని చెప్పటమే తప్ప ఇది ఆయన నిర్మాణ దక్షతను తప్పు పట్టడం కాదు.. ఆయన ప్రతిష్టను తక్కువ చేసి చూపటం కాదు. అజ్ఞాని విజయం కన్నా విజ్ఞాని అపజయం బాధాకరమన్న నిజాన్ని గ్రహిస్తారని ఆశిస్తూ..
సైనింగ్ ఆఫ్..
✍️జర్నలిస్ట్ ప్రభు.