Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ-క్రిష్ జాగర్లమూడి

Sun 18th Oct 2015 02:16 AM
kanche movie,krish jagarlamudi,varun tej,pragna jaiswal  సినీజోష్ ఇంటర్వ్యూ-క్రిష్ జాగర్లమూడి
సినీజోష్ ఇంటర్వ్యూ-క్రిష్ జాగర్లమూడి
Advertisement

గమ్యం, వేదం, కృష్ణంవందే జగద్గురుం వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు క్రిష్. బాలీవుడ్ లో ఇటివలే గబ్బర్ చిత్రం తో మంచి విజయాన్ని సాధించిన క్రిష్ దర్శకత్వం లో రూపొందిన మరో ప్రతిష్టాత్మక చిత్రం కంచె. వరుణ్ తేజ్, ప్రగ్య జైస్వాల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో సినీజోష్ ఇంటర్వ్యూ..

25 లక్షల మందిలో ఒకరి కథే ఇది..

గత వందేళ్ళ చరిత్రలో రెండో ప్రపంచ యుద్ధానికి మించి మనిషి గతిని మార్చింది.. మరొకటి లేదు. ఈ యుద్ధం జరిగి సుమారుగా 75 సంవత్సరాలు అయింది. 25 లక్షల భారతీయ సైనికులు ఇందులో పోరాడారు. ప్రతి ఒక్కరికి ఒక చాప్టర్ ఉంటుంది. ఆ ఇరవై ఐదు లక్షల్లో ఒకరి కథను బ్యాక్ డ్రాప్ గా తీసుకొని సినిమా చేసాను. 

వరుణ్ తప్ప మరెవరు చేయలేరు..

మంచి పేరున్న హీరోలతో నేను ఈ సినిమా చేస్తే వాళ్లకు ఒరిగేది.. సినిమాకు జరిగేది కేవలం బడ్జెట్ మాత్రమే. అదే వరుణ్ తో చేస్తే నిజాయితీను, సమగ్రతను నిలబెట్టగలుగుతాను. వరుణ్ మొదట సినిమా నేనే చేయాల్సివుంది కాని కుదరలేదు. అప్పటినుండే తనతో ట్రావెల్ చేస్తున్నాను. తన కళ్ళలో నిజాయితీ ఉంది. కంచె ఓ సైనికుడి ప్రేమకథ. 1940 లో జరిగే కథ కాబట్టి హీరో అలానే కనిపించాలి. అప్పట్లో 18,19 సంవత్సరాల పిల్లలు చాలా మెచ్యూర్డ్ గా కనిపించే వారు. ఇప్పుడైతే ఇంకా చిన్నపిల్లల్లానే కనిపిస్తారు. 1936 లో మాద్రాసు పట్నంలో చదువుకునే కుర్రాడి పాత్రలో, 1944 లో జరిగే యుద్ధంలో భారతీయ సైనికుని పాత్రలో వరుణ్ చూపించిన వేరియేషన్స్ మరెవరు చూపించలేరు. అంత అధ్బుతంగా నటించాడు. తన నటన చూసి శాస్త్రి గారు ఏంటయ్యా.. ఈ అబ్బాయి నటిస్తున్నాడా..? జీవిస్తున్నాడా..? అనడిగారు. వరుణ్ తన పాత్రలో ఒదిగిపోయి నటించాడు. 

ప్రేమను మాత్రం వేరు చేయలేరు..

మనుషుల్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, యాసలుఇలా ప్రతి దాంట్లో వారు చేసి చూస్తున్నారు. ఎంత వేరు చేసిన ప్రేమ మాత్రం మారదు. సీత అనే సంపన్న కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి అదే వూర్లో ఉండే మరో అబ్బాయి చెన్నైలోని కలుసుకుంటారు. వారి పరిచయం ప్రేమగా మారుతుంది. వారి ప్రేమ వలనే కంచెలు ఏర్పడతాయి. వాటివల్ల అందరు కొట్టుకునే స్థాయికి చేరుతారు.

ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు..

ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు చూడని సినిమా మేము చేస్తున్నాం. సుమారుగా అన్ని జోనర్స్ లో సినిమాలు వచ్చాయి. కాని ఈ ఒక్క జోనర్ లో తెలుగు తెరపై సినిమా రాలేదు. అందుకే రాజీవ్ గారు బాగా ఖర్చు పెట్టి కంచె తీసారు. ఎన్ని జోనర్స్ ఉన్నా.. ఒకే రకమైన కథలపై పరుగులు పెడుతున్నారు. కథలను, జీవితాలను సినిమాగా ఎందుకు చేయలేకపోతున్నారో తెలియట్లేదు. రెగ్యులర్ గా ఉండే కథలు నన్ను ఎగ్జైట్ చెయ్యట్లేదు. ఈగ సినిమా చూసాక ఎంత బావుందీ.. చిత్రం అనిపించింది. మణిరత్నం గారు ముందు నాకోసం సినిమా తీసుకుంటాను.. తరువాత ప్రేక్షకులకు చూపిస్తానని.. చెబుతుంటారు. అందుకే ముందు నన్ను తృప్తి పరిచేలా సినిమా తీస్తాను. కంచె ఓ పీరియాడిక్ ఫిలిం. వార్ బ్యాక్ డ్రాప్ లో జరిగే  ఓ ప్రేమకథ. 

వివరించడానికి ఎక్కువ సమయం తీసుకున్నాం..

ఈ సినిమా షూటింగ్ 55 రోజుల్లో కంప్లీట్ చేసాం. ఇండియాలో సగం షూటింగ్ పూర్తి చేసి, జార్జియా లో సుమారుగా ముప్పై రోజులు పైనే షూటింగ్ నిర్వహించాం. రోజుకు ఇరవై నుండి ముప్పై లక్షల బడ్జెట్ అయ్యేది. అందుకే షూటింగ్ రోజులు తగ్గించాల్సి వచ్చింది.1944 లో జరిగిన యుద్ధంలో సుమారుగా అన్ని దేశాలు పాల్గొన్నాయి. మనకు స్వతంత్రం రావడానికి కూడా రెండో ప్రపంచయుద్ధం ఒక కారణం. అందుకే దానిని వివరంగా చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకున్నాం. 

కంచె ఆలోచన అప్పుడు పుట్టింది..

జపాన్ వారు అండమాన్ నికోబార్ దగ్గరగా వెళ్లి బాంబు వేసారు. అక్కడ కొండప్రాంతాల్లో దాని చర్యలు కనిపిస్తాయి. వైజాగ్ లో షిప్ మీద కూడా బాంబు వేయాలని ప్రయత్నించారు కాని అది వేరే చోట పడింది. వారు వెళ్ళిపోతూ వైజాగ్ లో ఓ డ్యామ్ వొదిలేసి వెళ్ళారు. నేను వేదం షూటింగ్ కోసం వైజాగ్ వెళ్ళినప్పుడు ఆ డ్యామ్ చూసాను. అక్కడ నుండే కంచె సినిమా చేయాలనే ఆలోచన పుట్టింది. హిందీలో గబ్బర్ సినిమా జూలై లో కాపీ రెడీ అయిన తరువాత నాకు ఆరు నెలలు ఫ్రీ టైం దొరికింది. అప్పుడే కంచె ప్రీప్రొడక్షన్ పనులు ప్రారంభించాను.

నాగబాబు గారు ఓకే చేసారు..

నేను వరుణ్ తో ఇంతకముందే సినిమా చేయాలి. నాగబాబు గారిని కలిసి కథ కూడా చెప్పాను. కాని ఆ సినిమా క్లైమాక్స్ మీద ఆరు నెలలు వర్క్ చేసినా.. సరిగ్గా కుదరలేదు. దాంతో నాగబాబు గారికి క్లైమాక్స్ కుదరట్లేదు సర్ సినిమా చేయలేనని చెప్పాను. కంచె మాత్రం బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసి ఆయనకు వినిపించాను. చాలా ఎగ్జైట్ అయ్యారు. వరుణ్ కూడా ఓకే చేసాడు.

చిన్న డీటెయిల్ మిస్ చేసాను..

సినిమా రెడీ అయిన తరువాత చూస్తే ఓ చిన్న డీటెయిల్ మిస్ చేశాననే విషయం తెలిసింది. నా ఫిజికల్, మెంటల్ స్త్రెంగ్థ్, సినిమా బడ్జెట్ ఎంతవరకు పర్మిట్ చేసిందో.. అంత వరకు సినిమా చేయడంలో అచ్చీవ్ అయ్యామనే చెప్పాలి. గొప్ప టీం, మంచి నిర్మాత కుదిరారు.

గొప్ప రచయిత..

సాయి మాధవ్ బుర్రా గారితో నేను కృష్ణంవందే జగద్గురుం సినిమా చేసాను. ఇప్పుడున్న రచయితల్లో నిజమైన రచయితాయన. కీర్తిశేషులు నాగరాజు గంధం గారు గమ్యం సినిమాకు డైలాగ్స్ అందించారు. బ్లాక్ టికెట్ నుండి భవద్గీత వరకు ప్రతి చిన్న విషయాన్ని కూడా రాయగలరు. ఆ తరువాత ఆయన లేకపోవడం వలన వేదం సినిమాకు కొన్ని కారణాల వలన నేనే డైలాగ్స్ రాసుకున్నాను. ఆ తరువాత నేను సాయి మాధవ్ ను కలిసాను. ఎనిమిది నెలల ముందు మీట్ అవ్వాల్సింది.. వేదం సినిమాకు మీరే డైలాగ్స్ రాసేవారని చెప్పాను. ప్రతి డైలాగ్ దేనికదే అన్నట్లుగా ఉంటాయి. తను డైరెక్టర్ అయితే కనుక మంచి రచయితను కోల్పోతాం. దర్శకునిగా మారకూడదనే కోరుకుంటున్నాను.

మంచికి మంచికి మధ్య సినిమా ఉండాలి.. 

విలన్ కు హీరో కు మధ్య గొడవలు ఇలా చెడుకు, మంచికి మధ్య సినిమాలు తీస్తుంటారు. అలా కాకుండా గుడ్ వర్సెస్ గుడ్ సినిమాలు చేయాలి. నేను తీసిన గమ్యం, వేదం ఆ కోవకు చెందినవే. గుడ్ వర్సెస్ బ్యాడ్ అని చెప్తూ.. కృష్ణంవందే జగద్గురుం సినిమా చేసి ఏవరేజ్ టాక్ తో సరిపెట్టుకున్నాను. అందుకే కథ సింప్లిస్టిక్ ఉండాలని కంచె మొదలుపెట్టాను. యూరోప్ లో ఈశ్వర్ ప్రసాద్, హరిబాబు అనే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ.. కథ మొదలవుతుంది. సీత అనే అమ్మాయి వారిద్దరికి ఏమవుతుందనే సింపుల్ కథను గొప్ప బ్యాక్ డ్రాప్ తీసుకొని క్లియర్ కట్ క్లైమాక్స్ తో సినిమా తీశాను. దేశాలకు దేశాలకు మధ్య కంచెలు పెడుతున్నాం. ఇక్కడ మనుషులకు మనుషులకు మధ్య కంచె పెడితే ఏంటనే..? మాక్రోమైక్రో అనాలిసిస్ చేస్తూ ఈ చిత్రాన్ని చేసాం. 

భారీ యుద్ధ సన్నివేశం ఉంది..

పన్నెండు నిమిషాల పాటు జరిగే ఓ భారీ యుద్ధ సన్నివేశం ఒకటుంది. దాని కోసం జార్జియాలో చాలా కిలోమీటర్లు బంకర్లు తవ్వాం. సినిమాలో యుద్ధం చూసిన తర్వాత ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారు. బాహుబలిలో ఎన్ని ఉన్నాయో.. అన్ని ఉంటాయి. 

ఆయన గొప్ప తాత్వీకుడు..

శాస్త్రి గారు గొప్ప తాత్వీకుడు. కథ గమనాన్ని నిర్దేసించేవి పాటలు. ఈ సినిమాలో ఐదు పాటలున్నాయి. తన పాటలతో సినిమాను నెక్స్ట్ స్టేజ్ కు తీసుకువెళ్తారు. అలానే గబ్బర్ సినిమా సమయంలో చిరంతాన్ భట్ ను కలిసాను. అధ్బుతమైన మ్యూజిక్ ఇస్తాడు. గొప్ప సాహిత్యానికి బెస్ట్ కంపోజిషన్ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరిని ఆకట్టుకుంటుంది. 

కమర్షియల్ హిట్ వస్తుందనే కాన్ఫిడెన్స్ ఉంది..

గమ్యం, వేదం చిత్రాలకు ముందు నుండి ఓ పాజిటివ్ ఎనర్జీ కనిపించింది. మళ్లీ ఈ చిత్రానికి నాకు అది కనిపిస్తుంది. ఇప్పటివరకు నాకు బాక్సాఫీస్ వద్ద బలమైన కమర్షియల్ విజయం దక్కలేదు. ఈ చిత్రంతో అది దక్కుతుందనే నమ్మకముంది.

మహేష్ బాబు, చరణ్ ల సినిమాలు కుదరలేదు..

మహేష్ బాబు తో శివం అనే సినిమా చేయాల్సివుంది కాని కుదరలేదు. అలానే రామ్ చరణ్ కు ఓ కథ చెప్పాను. మొదటి భాగం చాలా నచ్చింది. రెండవ భాగంలో మార్పులు చేయాలి కాని ఇప్పటివరకు చేయలేదు అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement