`RC17` గుజరాతీ సినిమాకు రీమేకా?
RC17 Poster trigger remake rumoursమెగా పవర్ స్టార్ రామ్ చరణ్- స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ `RC17` అధికారికంగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రీ-లుక్ పోస్టర్ చూసినప్పటి నుంచి ఇందులో పౌరాణిక అంశాలు ఉంటాయని.. రామ్ చరణ్ శ్రీకృష్ణుడి పోలికలతో కనిపించవచ్చని జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కథకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇదే క్రమంలో `RC17` చిత్రం గుజరాతీ బ్లాక్‌బస్టర్ సినిమా అయిన `లాల్లో` కి రీమేక్ అంటూ మీడియాలో పెద్దఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టమైంది. సుకుమార్ ఈ ప్రాజెక్ట్‌ను 2024 మార్చిలోనే ప్రకటించి అప్పటి నుంచే స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. అసలు `లాల్లో` సినిమా విడుదల కాకముందే సుకుమార్ స్క్రిప్ట్‌లో ఎక్కువ భాగం పూర్తి చేశారని కాబట్టి ఈ సినిమాకు రీమేక్ వార్తలతో ఎలాంటి సంబంధం లేదని తేలింది.
అలాగే రామ్ చరణ్ `లాల్లో` తెలుగు రీమేక్‌లో నటిస్తారనే వార్తలు కూడా పూర్తిగా నిరాధారమైనవని తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా హీరోయిన్‌కు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ తో కలిసి టీ-సిరీస్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
















































