హమ్మర్ వద్దు.. ఆటోలో వెళ్లు అంటే? ఖాతరు చేయని సింగర్!
Mika Singh recalled that singer Shaan once advised himబాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ మీకా సింగ్ పరిశ్రమలో కెరీర్ ప్రారంభ రోజులకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఓ సంభాషణలో పంచుకున్నారు. పంజాబీ సంగీత రంగంలో వచ్చిన `సావన్ మే లగ్ గయీ ఆగ్` పాట సూపర్ హిట్ కావడంతో ఆయనకు మంచి గుర్తింపుతో పాటు ఆర్థికంగా కూడా స్థిరత్వం లభించింది. ప్రారంభంలో తన సోదరుడు దలేర్ మెహందీ బృందంలో పనిచేస్తున్నప్పుడు 500 సంపాదించిన మీకా సొంత పాట హిట్ అయిన తర్వాత ప్రతి లైవ్ షోకు 10,000 వరకు ఆర్జించడం మొదలుపెట్టారు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే సమయానికే లైవ్ ప్రదర్శనల ద్వారా తగినంత సంపాదన ఉండటంతో ఇతరులలాగా అవకాశాల కోసం సంగీత దర్శకుల చుట్టూ తిరగకుండా షోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
2006లో బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మీకా సింగ్ విలాసవంతమైన `హమ్మర్` కారులో ప్రొడ్యూసర్లు, సంగీత దర్శకులను కలవడానికి వెళ్లేవారు. ఇది చూసిన ప్రముఖ గాయకుడు షాన్ ఆయనకు ఒక సలహా ఇచ్చారు. `నువ్వు హమ్మర్ కారులో వస్తే నీకు పని అవసరం లేదని ఇప్పటికే బాగా ధనవంతుడివని నిర్మాతలు భావిస్తారు. సంగీత దర్శకులు కూడా అసహనానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆటోలో వెళ్లడం మంచిది` అని చెప్పారు.
కానీ మీకా ఆ సలహాను పాటించలేదు. ఆ రోజుల్లో గాయకులు ప్రచారం కోసం పత్రికల్లో లక్షల రూపాయలు వెచ్చించి ప్రకటనలు ఇచ్చేవారని.. దానికి బదులుగా తాను హమ్మర్ కారులో తిరిగితేనే ఓ పెద్ద గాయకుడిననే భావన అందరిలో కలుగుతుందని నమ్మి తన పంథాలోనే ముందుకు సాగారు. ఈ వినూత్న ప్రచార వ్యూహం వల్ల మీకా త్వరగానే ఇండస్ట్రీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలోనే సంగీత దర్శకుడు ప్రీతమ్‌తో పరిచయం ఏర్పడింది. ప్రారంభంలో ప్రీతమ్ ఒక సిక్కు వ్యక్తి అని, విశాల్-శేఖర్ ఒక్కరే అని మీకా భావించేవారట.
మొదటి భేటీలోనే మరుసటి రోజే రికార్డింగ్‌కు రమ్మని ప్రీతమ్ అడగగా తాను వెంటనే ఖాళీగా ఉన్నానని చెబితే డిమాండ్ లేదనుకుంటారని భావించి మీకా రేపు కుదరదు ఎల్లుండి వస్తాను అని చెప్పారుట. అలా `అప్నా సప్నా మనీ మనీ` (2006) సినిమాలోని `దిల్ మే బాజీ గిటార్` పాటను రికార్డ్ చేశారు. ఆ పాట బ్లాక్‌బస్టర్ అవ్వడం, ఆపై 2007లో `జబ్ వి మెట్` లోని `మౌజా హీ మౌజా` పాటతో మీకా బాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ సింగర్‌గా స్థానం సంపాదించుకున్నారు.
















































