టాలీవుడ్‌లో ప్రీ-ఇండిపెండెన్స్ ఎరా ట్రెండ్!
The Pre-Independence Era Trend in Tollywood!
తెలుగు చలనచిత్ర పరిశ్రమ కథా ఎంపిక శైలిలో పెద్ద మార్పు కనిపిస్తోంది. రొటీన్ కమర్షియల్ ఫార్ములాలను పక్కనపెట్టి మేకర్స్ పాన్-ఇండియా స్థాయిలో యూనివర్సల్ అపీల్ ఉండే పీరియాడిక్.. స్వాతంత్య్ర పూర్వపు (ప్రీ-ఇండిపెండెన్స్) నేపథ్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. విదేశీ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుల గాథలను, చారిత్రక అంశాలను వెండితెరపై ఆవిష్కరించేందుకు టాలీవుడ్ స్టార్స్ పోటీపడుతుండటం విశేషం.
ఈ సరికొత్త జోనర్‌లో కేవలం అగ్ర హీరోలే కాకుండా యువ నటులు కూడా విభిన్నమైన ప్రాజెక్ట్‌లతో ప్రయోగాలు చేస్తుండటం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శ కత్వంలో తెరకెక్కుతోన్న `ఫౌజీ` చిత్రం స్వాతంత్ర్యానికి పూర్వపు నాటి కథాంశంతో రూపొందుతోంది. అలాగే రౌడీ విజయ్ దేవరకొండ నటిస్తోన్న`రణబాలి` కూడా పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో సాగుతుంది.
యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ స్వీయ నిర్మాణంలో రామ్ చరణ్ సమర్పణలో తెరకెక్కుతున్న `ది ఇండియా హౌస్` కూడా ఇదే కోవకు చెందిన చారిత్రక దేశభక్తి చిత్రమే. బ్రిటిష్ కాలం నాటి చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలన్నీ తెలుగు ప్రేక్షకులనే కాకుండా జాతీయ స్థాయిలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి.
ఈ ప్రీ-ఇండిపెండెన్స్ ట్రెండ్ టాలీవుడ్ స్థాయిని మరింత పెంచుతోంది. విభిన్న కాలమాన పరిస్థితుల్లో సాగే కథలు ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని పంచడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తాయనే అంచనాలు భారీగా ఉన్నాయి.







































