స్టార్ హీరోని చంపితే 5 కోట్ల సుఫారీ ఆఫర్
Rs 5 crore for killing Aamir Khanబాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ ల వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ, సామాజిక వివాదంగా మారింది. ఇటీవల ముంబైలోని బాంద్రా నివాసంలో అత్యంత ఆప్తుల మధ్య రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంటపై.. అటు బజరంగ్ దళ్ నిరసనలతో మొదలైన దాడులు ఇప్పుడు ప్రాణాలకే ముప్పు తెచ్చే స్థాయికి చేరుకున్నాయి.
తాజాగా అయోధ్యలోని తపస్వి ఛావానీ అధిపతి జగద్గురు పరమహంస ఆచార్య, అమీర్ ఖాన్‌ను హతమార్చిన వారికి రూ.5 కోట్ల బహుమతి ఇస్తానని బహిరంగంగా సుపారీ ప్రకటించడం తీవ్ర కలకలం రేపింది. అంతటితో ఆగకుండా.. సదరు దాడి చేసిన వ్యక్తికి అయ్యే కోర్టు మరియు న్యాయపరమైన ఖర్చులు కూడా తానే భరిస్తానని..ఆ బహుమతి మొత్తాన్ని సదరు హంతకుడి కుటుంబానికి అందజేస్తానని ఆయన పేర్కొనడం సంచలనంగా మారింది.
ఈ వివాదానికి ముందు మహారాష్ట్ర బిజెపి మంత్రి నితీష్ రాణె, అమీర్ ఖాన్‌ను `లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్` అని తీవ్రంగా విమర్శించారు. అమీర్ ఖాన్ కావాలనే హిందూ మహిళలను వివాహం చేసుకుంటూ లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నారని బజరంగ్ దళ్.. ఇతర రాజకీయ నేతలు ఆరోపిస్తూ ఆయన దిష్టిబొమ్మలను సైతం దహనం చేశారు.
పరస్పర అంగీకారంతో జరిగిన ఈ పెళ్లిని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. అమీర్ ఖాన్ సినిమాలను చూడాలా వద్దా అనే దానిపై హిందూ ప్రేక్షకులు ఆలోచించుకోవాలంటూ రాణె వ్యాఖ్యానించారు. ఇద్దరు వయోజనుల మధ్య జరిగిన వివాహ బంధాన్ని సామాజిక వివాదంగా మార్చడమే కాకుండా.. ఒక పబ్లిక్ ఫిగర్‌ను చంపడానికి బహిరంగంగా కోట్లు ఆఫర్ చేస్తూ న్యాయసహాయం అందిస్తామని ప్రకటించడం.. దేశంలో శాంతిభద్రతల జవాబుదారీతనంపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది.







































